గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్ద నిన్న రాత్రి ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మేడిద దీనమ్మ అనే మహిళ అక్కడికక్కడే మరణించింది. భద్రాచలం డిపోకు చెందిన టీఎస్ఆర్టీసీ బస్సు తిరుపతి వెళుతుండగా.. రోడ్డు దాటుతున్న మహిళను ఢీకొట్టింది. దీనిపై యడ్లపాడు ఎస్సై రాంబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
విద్యుత్ దీపాలు లేకపోవటమే కారణం:
జాతీయ రహదారిపై ఉన్న పారిశ్రామికవాడలైన తిమ్మాపురం- గణపవరం మధ్య కిలోమీటర్ వరకు విద్యుత్ దీపాలు లేవు. రోడ్డుకు ఇరువైపులా పలుకాలనీలు, స్పిన్నింగ్ మిల్లులు ఉండటంతో నిత్యం జనం, కార్మికులు అటూ.. ఇటూ తిరుగుతూ ఉంటారు. ఆ ప్రాంతం అంతా చీకటిగా ఉండడంతో వాహనాలు దగ్గరికి వచ్చే వరకూ రోడ్డు దాటే వారు కనిపించరు. ఇదే ప్రమాదాలకు కారణంగా ఉందని స్థానికులు అంటున్నారు. ఈ విషయాన్ని ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇంతవరకు విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయలేదని చెబుతున్నారు. ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి: సబ్బం హరి పార్థివదేహానికి నేడు అంత్యక్రియలు