తన మిత్రుడి భార్యను మానసికంగా వేధించిన కేసులో నిందితుడిని చేబ్రోలు పోలీసులు అరెస్టు చేశారు. గుంటూరులోని దక్షిణ మండలి డీఎస్పీ కార్యాలయంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జెస్సీ ప్రశాంతి కేసు వివరాలు వెల్లడించారు. యడ్లపాడుకు చెందిన బెజ్జం దేవా గ్లాడ్విన్ 2017లో గుంటూరులోని ఓ కళాశాలలో ఐటీఐ చదివాడు. ఆ సమయంలో కళాశాలలో ఓ వ్యక్తితో స్నేహం ఏర్పడింది. ఈ ఏడాది జులై మాసంలో వారిద్దరూ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలోని ఓ ద్విచక్ర వాహన షోరూంలో పనికి చేరి అక్కడే ఓ గదిని అద్దెకు తీసుకొని ఉండేవారు.
అయితే దేవా గ్లాడ్విన్ స్నేహితుడు గత నెల 7న గుంటూరు జిల్లా కొర్నెపాడుకు చెందిన ఓ యువతిని ప్రేమ వివాహం చేసుకొని వేరుగా కాపురం పెట్టాడు. ఆమె తన మిత్రుడిని దూరం చేస్తోందని దేవా గ్లాడ్విన్ కోపం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో అతను తన స్నేహితుడు, భార్య చిత్రాలను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఆమెకు, వారి సన్నిహితులకు చరవాణిలో పంపాడు. ఇలా చేస్తే ఆమె తన మిత్రుడి నుంచి విడాకులు తీసుకుంటుందని భావించాడు. ఇది తెలుసుకున్న బాధితురాలు తన గ్రామానికి వెళ్లినప్పుడు వట్టిచెరుకూరు పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. డీఎస్పీ ప్రశాంతి పర్యవేక్షణలో చేబ్రోలు సీఐ కేసు దర్యాప్తు చేపట్టి బుధవారం నగరంపాలెంలోని జిల్లా కోర్టు సమీపంలో నిందితుడిని అదుపులో తీసుకున్నారు. చాకచక్యంగా కేసు దర్యాప్తు చేసిన వట్టిచెరుకూరు ఎస్సై మహేంద్ర, హెచ్‌సీ మల్లికార్జునరావు, పోలీసులు రాము, రామచంద్రారెడ్డిని డీఎస్పీ ప్రశాంతి అభినందించారు.
ఇదీ చదవండీ.. vijayasai reddy: 'నా పేరున ఇప్పటివరకు విశాఖలో స్థలాలు, భూములు లేవు