గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన వ్యక్తికి(46) కరోనా నిర్ధరణ కావటంతో తొలుత నరసరావుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. గురువారం రాత్రి వ్యాధి తీవ్రం కావటంతో చిలకలూరిపేట క్వారంటైన్ కేంద్రానికి తీసుకెళ్లారు.
అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం శుక్రవారం ఉదయం 108 వాహనంలో జీజీహెచ్‌కు పంపారు. కొవిడ్ వార్డులోకి తరలించి వైద్యం అందించాలని సిబ్బందికి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని కుటుంబసభ్యులు వాపోయారు. స్ట్రెచర్, వీల్‌ఛైర్ అందుబాటులో లేకపోవడంతో తామే చెరో చేయి పట్టుకొని పాత ఆసుపత్రి మూడో అంతస్తులోని వార్డులోకి మెట్ల మీద నడిపించుకుంటూ తీసుకొచ్చామని తెలిపారు. అంతలోనే అతడి పరిస్థితి విషమించి మెట్లుమీదే కుప్పకూలి, తమ కళ్లముందే ప్రాణాలు కోల్పోయాడని బాధితుడి బంధువులు విలపించారు.
సిబ్బంది వెంటనే స్పందించి ఉంటే చనిపోయేవారు కాదని ఆరోపించారు. ఈ విషయాన్ని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆచార్య కె.సుధాకర్ దృష్టికి తీసుకెళ్లగా బాధితుడిని 108 సిబ్బంది నేరుగా క్యాజువాల్టీకి తీసుకొచ్చి ప్రవేశం కల్పించాల్సి ఉంటుందని చెప్పారు. అలా చేరిన ప్రతి ఒక్కరిని తమ సిబ్బందే స్ట్రెచర్ మీద వార్డులోకి తీసుకెళతారని తెలిపారు. బంధువులు రోగిని నేరుగా వార్డులోకి తీసుకెళ్లకూడదన్నారు. ఈ ఘటనలో ఏం జరిగిందో పూర్తి వివరాలు తెలుసుకుంటామని వివరించారు.
ఇదీ చూడండి