గుంటూరు జిల్లాలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. గురువారం ఒకే రోజు 8 కొత్త కేసులు వచ్చాయి. సత్తెనపల్లి 3, తాడేపల్లి-3, గుంటూరు నగరంలో 2 కేసులు వెలుగు చూశాయి. కొత్త వాటితో కలిపి ఇప్పటి వరకు జిల్లాలో కేసులు 602కు చేరాయి. గుంటూరు, నరసరావుపేట వంటి రెడ్‌జోన్ ఏరియాల్లో కేసులు తగ్గగా కొత్త ప్రాంతాలకు వ్యాధి విస్తరిస్తోంది. సత్తెనపల్లిలో తాజాగా వచ్చిన మూడు కేసులతో కలిపితే 5 వచ్చినట్లు అయింది.
ఇటీవల పట్టణానికి చెందిన ఒకరు హైదరాబాద్‌లో ఉండి అనారోగ్యం పాలై సత్తెనపల్లిలో మృతి చెందారు. అంత్యక్రియలు స్థానికంగా నిర్వహించారు. అంత్యక్రియలు పూర్తయ్యాక ఆ వ్యక్తికి కరోనా అని తేలింది. అప్పటికే శవాన్ని వారి కుటుంబీకులు, బంధువులు సందర్శించారు. ప్రస్తుతం వారి కుటుంబీకులకే నలుగురికి కరోనా వ్యాప్తి చెందగా గుంటూరులో ఉండే దూరపు బంధువు ఒకరికి సోకింది. వ్యాధి నిర్ధారణ పరీక్ష ఫలితంవచ్చే వరకు వే చి ఉండకుండా వెంటనే ఆసుపత్రి అధికారులు శవానికి పంచనామా చేసి అప్పగించటం వారి నిర్వాకాన్ని తెలియజేస్తోంది. యంత్రాంగం నిర్వాకం వల్ల కూడా కరోనా వ్యాప్తి చెందుతోందనటానికి ఇదో నిదర్శనం.
● తాడేపల్లిలో ఇంతకు ముందు ఓ వాలంటీర్‌కు పాజిటివ్ వచ్చింది. ఆ వాలంటీర్ ద్వితీయ కాంటాక్టులను క్వారంటైన్‌కు తరలించి పరీక్షలు చేయగా వారిలో ముగ్గురికి నిర్ధారణ అయింది. వీరంతా మహానాడునగర్ వాసులుగా గుర్తించారు.
● గుంటూరు ఏటీ అగ్రహారం, సీతారామనగర్‌లో మరో రెండు కేసులు వచ్చాయి. ఈ రెండు కేసుల్లో ఒకటి విజయవాడ నుంచి వ్యాపించిందని, మరొకరికి హోల్‌సేల్ కూరగాయల మార్కెఫట్ మూలాలుగా చెబుతున్నారు.
● నల్లపాడు ఠాణాలో పనిచేసే ఒకరికి ఇటీవల కరోనా నిర్ధారణ అయింది. దుగ్గిరాల నుంచి రాకపోకలు సాగించే సదరు ఉద్యోగికి ఇప్పటికీ కరోనా వ్యాప్తి ఎలా చెందింది? ఎక్కడి నుంచి వచ్చిందనేది తెలియకుండా ఉంది. దీంతో గురువారం ఆ స్టేషన్ సిబ్బందికి వైద్య సిబ్బంది వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. అయితే దుగ్గిరాలలో గురువారం సాయంత్రం మరో ఆరుగురికి కరోనా సోకింది. ఈ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. గ్రామంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేసి వ్యాధి నివారణ చర్యలకు గురువారం రాత్రి నుంచే శ్రీకారం చుట్టారు. మొత్తానికి దుగ్గిరాలలో కరోనా ఒక్కసారిగా విజృంభించటంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అదేవిధంగా వైద్య, ఆరోగ్యశాఖ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేసే తాడేపల్లికి చెందిన ఓ డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు పాజిటివ్ వచ్చింది. దీన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఈ ఉద్యోగికి పాజిటివ్ రావటంతో తాడేపల్లిలో ఆయన ఇంటి పరసరాల్లో ప్రాథమిక కాంటాక్టులను గుర్తించే పనిలో పోలీసు, వైద్య యంత్రాంగం నిమగ్నమైంది.
ఇదీ చదవండి: