Young Woman Gets one Crore Schorship for PHD: గుంటూరుకు చెందిన మారెడ్డి గౌతమి అనే యువతికి చిన్నప్పటి నుంచి చదువంటే చాలా ఇష్టం. ఆ మక్కువతోనే మైసూరులోని జేఎస్ఎస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ నుంచి డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సు పూర్తి చేసింది. చదువే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న గౌతమి.. మాస్టర్స్ చేసేందుకు పలు విదేశీ విశ్వవిద్యాలయాలకు దరఖాస్తు చేసింది. విదేశాల్లో ఉన్నత చదువుల ప్రయత్నాల్లో ఉండగానే గౌతమి తండ్రి రాజశేఖర్ రెడ్డికి హార్ట్ ఎటాక్ వచ్చి బైపాస్ సర్జరీ చేయించుకున్నారు. అప్పుడే కార్డియో వాస్కులర్ అండ్ హైపర్ టెన్షన్ అంశంపై దృష్టి సారించాలని నిర్ణయం తీసుకుంది గౌతమి. ఈ సమస్య నివారణకు ఉపయోగించే ఔషధాలు, వాటి ప్రభావం తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసింది.
అధ్యయనం చేస్తున్న సమయంలోనే నార్త్ డకోటా స్టేట్ యూనివర్శిటీ నుంచి పీహెచ్‌డీ పరిశోధన ప్రవేశాలకు దరఖాస్తు చేసింది. ఈ వర్సిటీకి చెందిన సీనియర్ ప్రొఫెసర్లు నిర్వహించిన ఆన్‌లైన్ ఇంటర్వ్యూ విజయవంతంగా పూర్తి చేసింది. దాంతో కోటి రూపాయలకు పైగా ఉపకారవేతనంతో పీహెచ్‌డీ చేసే అవకాశం అందుకున్నానని తెలిపింది గౌతమి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న మనదేశంలో విద్య, వైద్య, పరిశోధన రంగాలు ఎంతో కీలకమని గౌతమి చెబుతోంది. పీహెచ్‌డీ పరిశోధనల్ని భవిష్యత్తులో ఇక్కడి అవసరాలకు అనుగుణంగా వినియోగించేందుకు తన వంతు కృషి చేస్తానని అంటోంది. సామాన్యులకు, గ్రామీణ ప్రజలకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు గౌతమి ప్రయత్నిస్తానంటోంది.
నా ఇష్టాలు అర్థం చేసుకుని.. కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే.. ఇవన్నీ సాధిస్తున్నానని అంటోంది గౌతమి. కోటి రూపాయలకు పైగా ఉపకారవేతనంతో పీహెచ్‌డీ చేసే అవకాశం రావడం పట్ల ఆమె తల్లిదండ్రులు కూడా ఆనందపడుతున్నారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు 6 ఏళ్ల డాక్టర్ ఆఫ్ ఫార్మసీ కోర్సు అందుబాటులో ఉంది. కానీ డీ ఫార్మా చేసిన వారి సేవల్ని సరైన రీతిలో వినియోగించు కోకపోవడం వల్ల ఎక్కువ మంది విదేశాలకు వెళ్లుతున్నారని చెబుతోంది గౌతమి. వీరి సేవల్ని సద్వినియోగం చేసుకుంటే గ్రామీణ ప్రాంతాలకు మేలైన వైద్యం అందుబాటులోకి తీసుకురావచ్చు అని అంటోంది. ప్రతిభ, నైపుణ్యాతో మంచి ఉపకార వేతనం సొంతం చేసుకుని ప్రశంసలు పొందుతున్న గౌతమి.. భారత్‌లో విచ్చలవిడిగా మందులను విక్రయించడం మాత్రం తనను ఆవేదనకు గురి చేస్తోందని చెబుతుంది. నిబంధనలకు విరుద్ధంగా మందుల విక్రయం, వాడడం వల్ల భవిష్యత్‌లో దుష్ఫలితాలు ఎక్కువగా ఉంటాయని గౌతమి అంటోంది. ఈ క్రమంలో దీనిపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించాలని కోరుతోంది.