Student Suicide in Nuziveedu IIIT: ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ వసతి గృహంలో కృష్ణా జిల్లా కోడూరు మండలం ఇరాలికి చెందిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థ్థి గంజాల మణికంఠ(17) ఫ్యాన్‌కు ఉరేసుకొని గురువారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బలవన్మరణానికి కారణాలు తెలియలేదు. బుధవారం రాత్రి అందరం కలిసి భోజనానికి వెళ్లామని, అప్పుడు కూడా సరదాగా మాట్లాడాడని సహచర విద్యార్థులు, అతడి స్నేహితులు చెప్పారు. ఈ నెల 23న మణికంఠ పుట్టిన రోజు వేడుకలను ఇక్కడి ఫుడ్ కోర్టులో చేసుకున్నట్లు తెలిపారు. ప్రథమ సంవత్సరంలో కొన్ని పాఠ్యాంశాల్లో తప్పాడని, వాటిపై దిగులుచెందుతున్నట్లు ఎప్పుడూ కనిపించలేదని పేర్కొన్నారు. గురువారం ఉదయం 7.10 గంటల వరకు మణికంఠ వీడియో చాట్‌లో ఉండి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు డీఎస్పీ బి.శ్రీనివాసులు తెలిపారు. మణికంఠ ఆత్మహత్యపై ఆర్జీయూకేటీ కులపతి కేసీ రెడ్డి, డైరెక్టర్ జీవీఆర్ శ్రీనివాసరావు విచారం వ్యక్తం చేశారు. మృతుడి తండ్రి సుబ్రహ్మణ్యం, అతడి బంధువులు మాట్లాడుతూ తాము వచ్చేలోపు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారంటూ.. ట్రిపుల్‌ఐటీ యాజమాన్యం, పోలీసులపై అనుమానం వ్యక్తం చేశారు.
బాసర ట్రిపుల్ ఐటిలో ఏం జరిగిందంటే: తెలంగాణలోని బాసర ఆర్జీయూకేటీలో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతి కలకలం రేపింది. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి తండాకు చెందిన సురేశ్ రాఠోడ్ విద్యాలయంలో ఈ1 ఇంజనీర్ ఫస్టియర్ చదువుతున్నాడు. మంగళవారం మధ్యాహ్న సమయంలో వసతి గృహంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మధ్యాహ్నం మిత్రులు గదికి వెళ్లేసరికి లోపలి నుంచి తాళం వేసి ఉంది. అనుమానంతో తలుపులు పగలకొట్టి చూడటంతో విద్యార్థి సురేష్ ఉరివేసుకొని ఉన్నాడు.
వెంటనే నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ వేణుగోపాలకృష్ణ తెలిపారు. మృతదేహాన్ని మార్చురీ గదిలో భద్రపరిచారు. కుటుంబ సభ్యులు వచ్చిన అనంతరం పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు వైద్యులు తెలిపారు. ముందస్తు జాగ్రత్తగా జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో డీఎస్పీ జీవన్ రెడ్డి నేతృత్వంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇవీ చదవండి: