Effects of Power Outage in Hospital: రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతలు లేవనేది అటు ప్రభుత్వం.. ఇటు విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్న మాట. డిమాండ్ ఉన్నప్పటికీ ఎక్కడా కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికార వర్గాలు గంటాపథంగా చెబుతున్నాయి. మండుతున్న ఎండలు, ఉక్కపోతకు తోడు.. ఎడా పెడా విధిస్తున్న విద్యుత్ కోతలు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విద్యుత్ కోతలు లేవంటూనే.. ఇష్టారీతిగా విధిస్తున్న విద్యుత్ కోతలతో సామాన్యులతో పాటు.. వివిధ చికిత్సల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులు సైతం ఇబ్బంది పడుతున్నారు.
ఇదీ ఏలూరు జిల్లాలోని చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలోని పరిస్థితి. నిత్యం చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో రోగులు ఇక్కడికి వస్తుంటారు. చింతలపూడి పరిసర గ్రామాలతో పాటు తెలంగాణలోని సత్తుపల్లి నుంచి సైతం ఈ ఆసుపత్రికి రోగులు వస్తుంటారు. వైద్యం కోసం వచ్చిన వారు అనారోగ్య సమస్య కన్నా విద్యుత్ కోతలతోనే ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారు. సమయంతో పని లేకుండా ఇష్టారీతిగా విధిస్తున్న కోతలతో ఇన్‌పేషంట్‌లతో పాటు సాధారణ ఓపీ విభాగాల్లోనూ రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జనరల్, ప్రసూతి విభాగం, ఆపరేషన్ గది.. ఇలా ఆసుపత్రిలో ఎటు చూసినా అంధకారమేనని రోగులు వాపోతున్నారు.
రోగులతో పాటు వైద్య సేవలు అందించే డాక్టర్లకు సైతం ఉక్కపోత అవస్థలు తప్పడం లేదు. ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో విధులు నిర్వహించే సిబ్బంది.. విద్యుత్ కోతలతో సతమతమవుతున్నారు. రోగుల వెంట వచ్చే సహాయకులు సైతం విద్యుత్ సరఫరా అంతరాయంతో.. మండు టెండలకు ఇబ్బందులు పడుతున్నారు. చింతలపూడి ఆస్పత్రిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు, అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు వీలుగా జనరేటర్ అందుబాటులో ఉంది. కానీ డీజిల్‌కు సంబంధించి అధికారులు పరిమితి విధించడంతో జనరేటర్ నిరుపయోగంగా మారిందని రోగులు ఆరోపిస్తున్నారు.
"మా వదినకు హార్ట్ స్ట్రోక్ వచ్చిందని మేము ఈ హాస్పిటల్‌కు తీసుకుని వచ్చాము. డాక్టర్లు, నర్సులు వైద్యం సరిగానే చేశారు. అయితే ఆస్పత్రిలో విద్యుత్ సదుపాయం సరిగా లేదు. ఎప్పటికప్పుడు కరెంట్ పోతోంది. దీనివల్ల పేషెంట్లు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చుట్టుపక్కల గ్రామస్థులకు ఏ జరిగినా.. చికిత్స మేరకు ఇదే హాస్పిటల్‌కు వస్తారు. ఆస్పత్రిలో ఉన్న విద్యుత్ కోతల కారణంగా వారంతా సతమతమవుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి ప్రభుత్వ హాస్పిటల్స్‌లో విద్యుత్ అంతరాయం కలుగకుండా చేయాలని కోరుకుంటున్నాము." - భూక్యా దొరబాబు, నాగిరెడ్డిగూడెం
మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఏరియా ఆస్పత్రిలో ఇటీవల నిలిచిపోయిన విద్యుత్ సరఫరాతో ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అసలే ఎండ.. ఆపై విద్యుత్ అంతరాయంతో.. పేషెంట్ల అవస్థలు వర్ణనాతీతం. జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరాకు ప్రయత్నించినా అది సాధ్యంకాలేదు. దాదాపు పది గంటల వరకు హాస్పిటల్ అంతా అంధకారమయంగా మారింది. మిరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఏరియా ఆసుపత్రిలో మంగళవారం అంధకారం ఆసుపత్రిలోని విద్యుత్ సరఫరా లైన్లు షార్ట్ సర్క్యూట్‌తో కావడం వలన మంగళవారం సాయంత్రం ఐదుగంటలకు కరెంట్ సరఫరా నిలిచిపోయింది. స్పందించిన ఆసుపత్రి ఇన్చార్జి పర్యవేక్షకుడు కేఎస్ త్రిమూర్తులు, వైద్య సిబ్బంది జనరేటర్ ద్వారా విద్యుత్ సరఫరాకు ప్రయత్నించినా సాధ్యపడలేదు.
ఇవీ చదవండి: