NO WATER FOR PADDY FIELDS : నిన్నటి వరకు ధాన్యం ఊడ్చి దాన్ని అమ్ముకునేందుకు నానా అవస్థలు పడ్డ రైతాంగం ఇప్పుడు తర్వాత పంట పండించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం దెందులూరు, పోతునూరు గ్రామాల్లో రైతులు దాల్వా పంట పండిస్తుండగా ఇప్పుడు ఆ వరి పొలాలకు సాగు నీరు అందడం లేదు. లంక కాలువ ఆయకట్టు కింద సాగవుతున్న ఈ పొలాలు కాస్త మెరకగా ఉండటంతో కాలువ నీళ్లు వదిలినా పొలాలకు చేరడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది రోజుల కిందట అధికారులు కాలువల్లో గడ్డి తొలగింపు పేరుతో నీటి సరఫరా ఆపేశారని పొట్ట దశలో వరి పొలానికి నీళ్లు లేకపోతే పంట ఎందుకూ పనికి రాకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పోతునూరులో లంక కాలువ కింద దాదాపు 350 ఎకరాల ఆయకట్టు ఉండగా వీటిలో కాలువ కింద ఉండే పొలాలు మినహా 100 నుంచి 150 ఎకరాల వరకు నీరు అందే పరిస్థితి కనిపించడం లేదు. గత దాల్వా సీజన్లోనూ ఇదే పరిస్థితి ఉండగా అధికారులకు మొరపెట్టుకుంటే నీళ్లు ఇచ్చారని ఈసారి ఎవరిని అడిగినా పట్టించుకునే వారు కనిపించడం లేదంటూ రైతులు ఆవేదన చెందుతున్నారు. పొట్ట దశలో నీరు అవసరం కాగా అరకొర నీరూ అందక పంట చేలు భారీగా బీటలు వారుతున్నాయని రైతులు చెబుతున్నారు.
వరినాట్లు వేసింది మొదలు ఇప్పటి వరకూ పంట పెట్టుబడి కింద దాదాపు 30 నుంచి 35 వేల రూపాయలు ఖర్చు చేశామని ఈ దశలో పంటకు నీరందక పోవడం ఆందోళన కలిగిస్తోందని రైతులు వాపోతున్నారు. కనీసం మరో 30 నుంచి 40 రోజుల పాటు పంట పొలాలకు నీరు అవసరం అవుతుందని ప్రస్తుతం ఆ పరిస్థితి కనిపించకపోవడంతో పంట నష్టం తప్ప చేసేదేమీ లేదని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు పట్టించుకుని నీరు అందిస్తే కాస్తలో కాస్త కోలుకునే అవకాశం ఉంటుందని, లేని పక్షంలో పంట చేతికి రాక మరోమారు అప్పుల ఊబిలో కూరుకోక తప్పదని ఆవేదన చెందుతున్నారు.
గత సీజన్లో ఇలాంటి పరిస్థితి ఎదురైనా అధికారులకు ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం అయ్యేదని ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని రైతులు చెబుతున్నారు. రైతులను ఆదుకుంటామని పదే పదే చెబుతున్న ప్రభుత్వం వారు ఎదుర్కొంటున్న ఇక్కట్లను గుర్తించి వాటికి పరిష్కారం చూపాలని వేడుకుంటున్నారు.
ఇవీ చదవండి