Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర జోరుగా సాగుతోంది. టీ.నర్సాపురం మండలం బొర్రంపాలెం శివారు నుంచి ప్రారంభమైన యాత్రకు దారిపొడవునా స్థానికులు, టీడీపీ నాయకులు అఖండ స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులు పడుతూ లోకేశ్‌ను దీవించారు. రాఖీ పౌర్ణమి కావడంతో పలువురు మహిళలు లోకేశ్‌కు రాఖీలు కట్టి తమ సంతోషాన్ని పంచుకున్నారు. దారిపొడవునా తనను చూసేందుకు వచ్చిన వారిని పలకరిస్తూ తమ సమస్యలు పరిష్కరించాలంటూ నివేదన రూపంలో ఇస్తున్న వినతి పత్రాలను స్వీకరిస్తూ లోకేశ్ ముందుకు సాగుతున్నారు. రావికంపాడు, దేవులపల్లి వద్ద టీడీపీ శ్రేణులు భారీ గజమాలలు, అరటి, దబ్బకాయలతో తయారుచేసిన మాలలతో లోకేశ్‌కు ఘన స్వాగతం పలికారు.
Nara Lokesh Comments on CM Jagan: వైసీపీ నేతలకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం ఖాయం: లోకేశ్
Lokesh comments on Jagan in meeting held at Jangareddygudem: జంగారెడ్డిగూడెంలో జరిగిన బహిరంగ సభలో లోకేశ్ మాట్లాడుతూ అలిపిరి టోల్గేట్ ఛార్జీల నుంచి శ్రీవారి సేవలు, ప్రసాదం, కల్యాణ మండపాలు, అతిథిగృహాల ఛార్జీలు విపరీతంగా పెంచి సామాన్యులకు దేవుడిని దూరం చేశారని మండిపడ్డారు. తిరుమలను రాజకీయ కేంద్రంగా మార్చారని, తిరుమల కొండను బోడిగుండు అన్న భూమన కరుణాకరరెడ్డిని తితిదే ఛైర్మన్ చేశారని విమర్శించారు. జగన్ మూడు రాజధానులు కడతానని చెప్పారని కనీసం మూడు ఇటుకలు కూడా వేయలేదని దుయ్యబట్టారు.
Lokesh criticized YCP MLAs Eliza and Balaraju: చింతలపూడి, పోలవరం నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యేలు ఎలీజా, బాలరాజుపైనా విమర్శనాస్త్రాలు సంధించిన లోకేశ్ వారి అవినీతి చిట్టాను ప్రజలముందుంచే ప్రయత్నం చేశారు. జిల్లాలో అవినీతి ఎమ్మెల్యేల జాబితాలో ఎలీజా తొలి స్థానంలో ఉన్నారని రైతులకు పాసు పుస్తకం ఇవ్వాలన్నా కప్పం కట్టాల్సిందేనని దుయ్యబట్టారు. అంగన్వాడీ ఆయా పోస్టుల నుంచి జల్లేరు, ఎర్ర కాలువ నుండి ఇసుక దోపిడీ వరకు ఎమ్మెల్యే చేయని అవినీతి లేదంటూ విరుచుకుపడ్డారు. జగన్ అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు పడకేశాయని లోకేశ్ విమర్శించారు. జగన్‌ను ఆయన అమ్మ, చెల్లే నమ్మడంలేదని ప్రజలు ఎలా నమ్ముతారని లోకేశ్ ప్రశ్నించారు. జగన్ రైతు లేని రాష్ట్రాన్ని తయారు చేస్తున్నారని రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో మూడు, కౌలు రైతుల ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉందన్నారు. అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని హామీ ఇచ్చారు.
Yuvagalam Yatra will enter Polavaram Constituency: 2024లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో పూర్తి మెజారిటీ ఇవ్వాలని అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తామని లోకేశ్ హామీ ఇచ్చారు. నాలుగేళ్లుగా పోరాడుతున్న కార్యకర్తల్ని గుండెల్లో పెట్టుకుంటానని టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని లోకేశ్ హెచ్చరించారు. బొర్రంపాలెం నుంచి ప్రారంభమైన యాత్ర వల్లంపట్ల, మల్లుకుంట, రావికంపాడు, దేవులపల్లి, పుట్లగట్లగూడెం, గుర్వాయిగూడెం, జంగారెడ్డిగూడెం పట్టణం మీదుగా కొయ్యలగూడెం శివారువరకు చేరింది. 199వ రోజు లోకేశ్ సుమారు 20 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయగా.. ఇవాళ యువగళం యాత్ర పోలవరం నియోజకవర్గంలోకి ప్రవేశించనుంది.