Murder for cash in Eluru district: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలో దారుణం చోటు చేసుకుంది. రూ.2 వేల కోసం రామకృష్ణ అనే వ్యక్తి తన స్నేహితుడైన శివపై, అతని కుటుంబ సభ్యులపై రాడ్డుతో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో శివ అనే వ్యక్తి మరణించగా.. భార్య, కుమారుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడు రామకృష్ణపై కేసు నమోదు చేసి, రిమాండ్‌కు పంపించారు. అయితే, ఈ దాడి జరగడానికి కారణాలు ఏంటి?, ఎందుకు రామకృష్ణ అనే వ్యక్తి ముగ్గురిపై రాడ్డుతో దాడి చేయాల్సి వచ్చింది..? అనే వివరాలను ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి ఘటన వివరాలను వెల్లడించారు.
ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ..''ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగూడెంలోని ఒక కుటుంబం మీద దాడి జరిగింది. ఆ దాడిలో భర్త, భార్య, కుమారుడికి గాయాలయ్యాయి. జరిగిన దాడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. రామకృష్ణ అనే ముద్దాయిని అరెస్ట్ చేశాము. ముద్దాయి రామకృష్ణ, మైసన్నగూడేనికి చెందిన తోనం శివకి స్నేహితుడు. బాలాజీ అనే వ్యక్తి తన బైక్‌ను తాకట్టు పెట్టి డబ్బులు తీసుకురమ్మని రామకృష్ణ (నిందితుడు)కి చెప్పాడు. దీంతో రామకృష్ణ కిశోర్ అనే వ్యక్తి దగ్గర రూ.13,000వేలకు తాకట్టు పెట్టి.. తన స్నేహితుడు (బాలాజీ)కీ మాత్రం రూ.11,000లకే తాకట్టు పెట్టానని చెప్పి.. మిగతా రూ. 2వేలను రామకృష్ణ తీసుకున్నాడు. ఈ క్రమంలో వారం తర్వాత బాలాజీ (బైక్ ఓనర్) మళ్లీ ఆ బైక్ కావాలంటూ రూ.11,000వేలను కట్టేసి, వాహనం తీసుకు రమ్మని రామకృష్ణకు చెప్పాడు. రామకృష్ణ వద్ద రూ.2వేల రూపాయలు తక్కువగా ఉన్నాయి. ఆ సమయంలో రామకృష్ణ స్నేహితుడైన తోనం శివకు వద్దకు పోయి రూ. 2వేలు కావాలంటూ అడిగాడు. కానీ, అతను ఇవ్వలేదు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో ఇద్దరు కలిసి మందు తాగారు. ఈ క్రమంలో శివ వద్ద రూ.15,000వేలు ఉన్నట్లు గమనించిన రామకృష్ణ.. పదే పదే డబ్బులు కావాలంటూ అడిగాడు. దానికి శివ డబ్బులు కుటుంబ అవసరాల కోసం దాచి ఉంచాను ఇవ్వలేనని తేల్చి చెప్పాడు. అనంతరం ఎవరింటికి వాళ్లు వెళ్లిపోయారు. ఇంతలోనే బాలాజీ వచ్చి బైక్ ఎక్కడ? అని ప్రశ్నించగా.. రామకృష్ణ అదే రాత్రి రెండున్నర గంటలకు తన స్నేహితుడైన శివ ఇంటికి వెళ్లాడు. ఇంటి బయటపడుకున్న శివను పక్కనే ఉన్న రాడ్డుతో తలపై గట్టిగా కొట్టి రూ.15వేలను తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంట్లో నిద్రిస్తున్న శివ భార్యపై, కొడుకుపై దాడి చేసి.. మంగళసూత్రం, నగలను రామకృష్ణ దొంగిలించాడు.'' అని ఘటన వివరాలను వెల్లడించారు.
అనంతరం స్థానికులు సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకుని..దాడిలో తీవ్రంగా గాయపడిన తోనం శివను, అతని భార్య, కుమారుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమాధ్యలో శివ మృతి చెందినట్లు.. ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు. నిందితుడు రామకృష్ణ శివను రాడ్డుతో కొడుతుండగా అతని భార్య చూసిందని, తెల్లవారితే పోలీసులకు ఫిర్యాదు చేస్తుందన్న ఆలోచనతో శివ భార్యపై, పదేళ్ల కుమారుడిపై విచక్షణరహితంగా రామకృష్ణ దాడి చేశారని ఎస్పీ మీడియా ముందు వెల్లడించారు.
ఇవీ చదవండి