Celebrated Bhogi Fire Across State With Grand Manner: తెలుగు లోగిళ్లలో భోగి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. వేకువజాము నుంచే భోగి మంటలు వేసి, బంధుమిత్రులతో కలిసి జనం సందడి చేస్తున్నారు. చిన్నారులకు భోగి పళ్లు పోసి సంప్రదాయంగా వేడుకలు జరుపుకుంటున్నారు. రంగవల్లులతో వాకిళ్లను సుందరంగా తీర్చిదిద్దారు. ఘుమఘుమలాడే పిండి వంటలు ఆరగిస్తూ,చిన్నాపెద్దా అంతా ఒకే చోట చేరి పండగ పరమార్థాన్ని చాటిచెబుతున్నారు.
ఏలూరు రాష్ట్రవ్యాప్తంగా భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వాడవాడలా భోగి మంటలు వేసి సందడిగా గడుపుతున్నారు. ఏలూరులోని ఎన్ హోటల్స్ అధినేత నారా శేషు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు నగర వాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భోగ భాగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ భోగి మంటలు వేశారు. చిన్నారులపై భోగి పళ్లు పోసి ఆశీర్వదించారు. దెందులూరులోని రామదండు ఆధ్వర్యంలో నిర్వహించిన సంబరాలకు ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్, దెందులూరు ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి హాజరయ్యారు. గంగిరెద్దుల విన్యాసాలు, హరిదాసుల సంకీర్తనలు, జంగం దేవరల ఆశీర్వచనాలు, కళారూపాలతో వైభవంగా వేడుకలు చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మెుదలైన సంక్రాంతి సందడి
నెల్లూరులో ధాన్యాగారంగా పేరున్న నెల్లూరు జిల్లా పల్లెలు, పట్టణాల్లో భోగి పండుగ వైభవంగా నిర్వహించారు. భోగి మండలతో సంక్రాంతి కనుమ పండుగను ఆహ్వానిస్తూ పిల్లలు, పెద్దలు మహిళలు ఎంతోఆనందంగా మూడు రోజుల పండుగను జరుపుకుంటున్నారు. గ్రామీణ వాతావరణం కలగలసిన నెల్లూరు జిల్లాలో పెన్నా ఏటి ఒడ్డున ప్రత్యేకంగా పండుగను నిర్వహిస్తారు. భోగి మంటలతో కుటుంబాలు కలిసి ఆనందం పంచుకుంటున్నాయి.
తిరుమలలో శ్రీవారి ఆలయ మహద్వారం వద్ద తితిదే సిబ్బంది, భక్తులు భోగి మంటలు వేశారు. గోవింద నామస్మరణలతో భోగి మంటల చుట్టూ తిరిగారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థలో మంచు మోహన్ బాబు కుటుంబ సభ్యులతో కలిసి పండుగ చేసుకున్నారు. మంచు ఫ్యామిలీతో పాటు సినీ నటుడు శివ బాలాజీ కుటుంబసభ్యులు కూడా వేడుకల్లో పాల్గొన్నారు. తెలుగు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని మోహన్ బాబు ఆకాంక్షించారు.
పండగ వేళ షాక్ ఇచ్చిన ఆర్టీసీ - సరిపడా బస్సుల్లేక ప్రయాణికుల అవస్థలు
విజయవాడ ఇంద్రకీలాద్రీ పై దుర్గ మల్లేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భోగి పర్వ దినాన్ని పురస్కరించుకొని కొండ పై చిన రాజగోపురం వద్ద భోగి మంటలు వేశారు. దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు,ఈవో కె.ఎస్ రామారావు,వైదికకమీటి ,పాలక మండలి సభ్యులు,ఉద్యోగులు భోగిమంటల కార్యక్రమంలో పాల్గోన్నారు. శాస్త్రోత్తంగా భోగి మంటలు వేశారు. హరిదాస్ ల సంకీర్తనలు,బసవన్నల విన్యాసాల నడుమ భోగిమంటలను నిర్వహించారు.
కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ విప్ జగ్గిరెడ్డి భోగి మంటలు వెలిగించి వేడుకలను ప్రారంభించారు. కేరళ నుంచి బృందాలు, గారిడి వాయిద్యాలు, హరిదాసుల కోలాటాలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
అనకాపల్లిలో ఎంపీ బి.వి. సత్యవతి ఇంటి వద్ద భోగి వేడుకలను ఘనంగా జరిపారు. కుటుంబ సమేతంగా ఎంపీ వేడుకల్లో పాల్గొన్నారు. విజయనగరంలోని వసంత విహార్‌లో అపార్ట్మెంట్ వాసులు సామూహికంగా భోగి వేడుకలు నిర్వహించారు. పొంగళ్లు, చెరకు గడలతో పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించేలా ప్రాంగణాన్ని అందంగా అలంకరించారు. సంప్రదాయ వస్త్రాలు ధరించి.. యువత ఆడిపాడారు.
నేడు సంక్రాంతికి "పల్లె పిలుస్తుంది రా కదలి రా" కార్యక్రమం - పాల్గొననున్న చంద్రబాబు, పవన్ కల్యాణ్