AP MLC Sheikh Sabji Funerals: తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి పార్థివ దేహాన్ని ఏలూరు కలెక్టరేట్ ఎదురుగా ఉన్న ఇండోర్ స్టేడియంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ఎమ్మెల్సీ షేక్ సాబ్జి పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ ఏలూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బడేటి చంటి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక ప్రజా సంఘాల నాయకులు, వందలాది మంది ఎమ్మెల్సీ పార్థివదేహాన్ని సందర్శించి కన్నీటి పర్యంతమయ్యారు.
షేక్ సాబ్జి సన్నిహితులు అతని ఉద్యమ పోరాటాలు, చేసిన కృషిని గుర్తు చేసుకుని శోకసంద్రంలో మునిగిపోయారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకుల సమస్య పరిష్కారం కోసం అనేక ఉద్యమాల్లో ఎమ్మెల్సీ షేక్ సాబ్జి భాగస్వామ్యం అయ్యారని, ఆయన మృతి ఉద్యమాలకు తీరని లోటు అని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
పాల తూము స్మశాన వాటికలో అంత్యక్రియలు: మధ్యాహ్నం కలెక్టరేట్ గ్రౌండ్ నుంచి సత్రంపాడులో ఉన్న ఆయన ఇంటి వద్దకు తీసుకొని వెళ్లనున్నారు. సత్రంపాడులోని షేక్ సాబ్జి ఇంటి వద్ద నుంచి అంతిమ యాత్ర ప్రారంభం అవుతుందని, శాంతి నగర్, సీఆర్ఆర్ కాలేజ్, కొత్త బస్టాండు, ఓవర్ బ్రిడ్జి, జ్యూట్ మిల్ వంతెన మీదుగా సాగనుంది. అదే విధంగా పంపుల చెరువు నుంచి వంగాయగూడెం మీదుగా సాగిన అనంతరం పాల తూము సెంటర్ వద్ద ఉన్న స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో ఏపీ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం
MLC Sheikh Sabji Accident: ఈ నెల 15వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ దుర్మరణం పాలయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఉండి మండలం వద్ద, సాబ్జీ ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో షేక్ సాబ్జీ మృతి చెందగా, ఆయన పీఏ, డ్రైవర్, గన్మెన్ తీవ్రంగా గాయపడ్డారు. భీమవరంలో అంగన్వాడీలు నిర్వహిస్తున్న ఆందోళనలో పాల్గొనేందుకు ఏలూరు నుంచి ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ కారులో బయల్దేరగా మార్గ మధ్యలో ఈ ఘటన చోటుచేసుకుంది.
MLC Family Members About Accident : ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ మరణంపై ఆయన కుమారుడు ఆజాద్, సోదరుడు ఫరీద్ ఖాసీం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. తన తండ్రిది సాధారణ రోడ్డు ప్రమాదం కాదని ఎవరో పథకం ప్రకారమే చేసి ఉంటారని ఆజాద్ ఆరోపించారు. ఆయన పోస్టుమార్టం సక్రమంగా జరగలేదని అనుమానం వ్యక్తం చేశారు.
పక్కా ప్రణాళిక ప్రకారమే హత్య - రోడ్డు ప్రమాదం కాదు : ఎమ్మెల్సీ సాబ్జీ కుబుంబ సభ్యులు