Students and parents fire on YSRCP Govt: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. విద్యార్థుల పట్ల, సర్కారీ బడుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖ అధికారులు వ్యవహరిస్తున్న తీరును విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్ర చేపట్టిన సమయంలో ప్రభుత్వ బడులు రూపురేఖలు మార్చేస్తామంటూ హామీల మీద హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఒక్కటి కూడా అమలు చేయలేకపోతున్నారని దుయ్యబడుతున్నారు. నాడు-నేడు పథకం పేరుతో పాఠశాలల్లో చేపట్టిన పనులు నత్తనడకన సాగడంపై ఆవేదన చెందుతున్నారు.
సర్కారీ బడుల రూపురేఖల్ని మార్చేస్తాం.. ప్రభుత్వ బడులను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారుచేస్తామని ప్రచారం చేశారు. నాడు-నేడు పథకం కింద సర్కారీ బడుల రూపురేఖల్ని సమూలంగా మార్చేస్తామని హామీ ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాలుగేళ్లుగా ఇదే ప్రకటనలతో ఊదరగొడుతూ వస్తోంది. ఇప్పటికే విద్యా సంవత్సరం ప్రారంభమైనా.. నాడు-నేడు పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. ఎన్నో ఆశలతో బడి బాట పడుతున్న విద్యార్థులకు అసంపూర్తి పనులు ఘనంగా స్వాగతం పలుకుతున్నాయి.
పాఠశాలల్లో పెరిగిన పిచ్చి మొక్కలు-వెలిసిన రంగులు.. ఓవైపు పిచ్చి మొక్కలు.. మరోవైపు రంగు వెలసిన గోడలు.. ఇంకోవైపు దుర్వాసన వెదజల్లే పరిసరాలు.. ఇవీ ఏలూరు మండలం శ్రీరామ్ నగర్‌లోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలోని దృశ్యాలు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఉన్న ఈ పాఠశాలలో.. నాలుగేళ్ల క్రితం వరకు 300 మందికి పైగా విద్యార్థులు విద్యనభ్యసించేవారు. కానీ, నేడు మౌలిక సదుపాయాల లేమితో చిన్నారుల సంఖ్య 120కే పరిమితమైంది. రాష్ట్రంలో చాలా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కొరత విద్యార్థులను వెక్కిరిస్తూనే ఉంది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరే వారి సంఖ్యను రెట్టింపు చేస్తామంటూ.. 2014 నవంబరులో ప్రభుత్వం నాడు-నేడు పనుల్ని ప్రారంభించింది. విడతల వారీగా ప్రభుత్వ పాఠశాలల్ని సుందరంగా తీర్చిదిద్దుతామంటూ పనుల్ని ప్రారంభించారు. కానీ, వాటి అమలును మాత్రం ప్రజాప్రతినిధులు, అధికారులు గాలికొదిలేశారు. దాని ఫలితమే ఎంతో మంది విద్యార్థులు పాఠశాలలకు దూరం అవుతున్నారు.
నాడు-నేడుకి రూ.12వేల కోట్లు కేటాయింపు.. నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల తలరాతలు మార్చేస్తామంటూ ఊదరగొట్టిన ప్రభుత్వం.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పథకాన్ని చిత్తశుద్ధితో అమలు చేయలేకపోతోంది. ఈ పథకానికి మూడేళ్లలో 12వేల కోట్ల రూపాయలు కేటాయించింది. కానీ, ఆ మేరకు పనులు జరగడం లేదు. నాడు-నేడు కింద పాఠశాలల్లో అదనపు గదుల నిర్మాణం, ప్రహరీ గోడల ఏర్పాటు, తాగునీటి సదుపాయం, మరుగుదొడ్ల నిర్మాణం, పాఠశాలలకు రంగులు వేయడం, విద్యుదీకరణ పనులు, డిజిటలైజేషన్.. ఇలా ఎన్నో పనులు పూర్తిచేయాల్సి ఉంది. కానీ ప్రభుత్వం గుత్తేదారులకు సక్రమంగా బిల్లులు చెల్లించకపోవడంతో పనుల్లో జాప్యం నెలకొంది. ఇన్ని అవాంతరాలను దాటుకుని.. ఆచరణ రూపం దాల్చేందుకు ఏళ్లు పట్టేలా కనిపిస్తోందని స్థానికులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సామాగ్రిపై శ్రద్ధ-పనులపై నిర్లక్ష్యం.. నాడు-నేడు పనుల్లో భాగంగా పాఠశాలకు తెచ్చిన బల్లలు, టైల్స్ ఇతర సామగ్రి కొనుగోలు విషయంలోనూ విమర్శలు వినిపిస్తున్నాయి. కమీషన్లు వచ్చే సామాగ్రిని ఆగమేఘాల మీద తెప్పించడంలో పెట్టిన శ్రద్ధ.. వాటిని పూర్తి చేయడంలో మాత్రం చూపలేదని స్థానికులు మండిపడుతున్నారు. నాడు-నేడు పనుల కోసం తెచ్చిన సామాగ్రి ఆయా పాఠశాలల ఆవరణలో అలానే ఉంచడంతో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ప్రారంభమైన బడులు-మొదలుకాని పనులు.. వాస్తవానికి మే నెలాఖరు నాటికి నాడు-నాడు రెండోదశ పనులు పూర్తి కావాల్సి ఉంది. కానీ, క్షేత్రస్థాయిలో కొన్ని పాఠశాలల్లో పనులు ఇంకా కొలిక్కి రాలేదు. మరికొన్ని బడుల్లో పనులు ఇంకా ప్రారంభానికే నోచుకోలేదు. ఫలితంగా కొత్త విద్యా సంవత్సరంలో ఎన్నో ఆశలతో అడుగుపెట్టిన విద్యార్థులు.. పాత సమస్యలతోనే సావాసం చేయాల్సిన దుస్థితి నెలకొంది.