Amaravati Farmers Padayatra: అమరావతి నుంచి అరసవల్లి వరకు రాజధాని రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ఏలూరు జిల్లా ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు. నిన్న పాదయాత్రకు తాత్కాలికంగా విరామమిచ్చిన రైతులు.. ఈరోజు ఏలూరు సమీపంలోని కొత్తూరు నుంచి యాత్ర ప్రారంభించారు. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా దారి పొడవునా స్థానికులు, మహిళలు రైతులతో కలిసి పాదం కదిపారు. ఏకైక రాజధానిగా అమరావతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. దెందులూరు నియోజకవర్గంలోని పలు గ్రామాల ప్రజలు అడుగడుగునా పూలతో స్వాగతం పలికారు. స్థానికులు హారతులతో మద్దతు తెలిపారు. వారి అభిమానాన్ని చూసి మహిళా రైతులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగారు.
తెదేపా, జనసేన, వివిధ సంఘాల ప్రతినిధులు పాదయాత్రకు సంఘీభావం తెలిపారు. మంత్రి అంబటి రాంబాబు వ్యాఖ్యలను రైతులు ఖండించారు. నోరు అదుపులో పెట్టుకోకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఏలూరు నగరంలో పాదయాత్రకు అపూర్వ స్పందన వచ్చింది. రాష్ట్రం కోసం భూములిచ్చి రోడ్డెక్కిన రైతులకు కచ్చితంగా న్యాయం జరుగుతుందని స్థానికులు భరోసా ఇచ్చారు.
రైతుల పాదయాత్రకు బాపట్ల జిల్లా చందలూరు రైతులు సంఘీభావం తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన దివ్యాంగులు రైతులతో పాటు పాదయాత్రలో పాల్గొన్నారు.
ఇవీ చదవండి: