YSRCP Leader Suicide Attempt: రైతులపై SC, ST కేసు పెడితే ఎకరం పొలం, డబ్బులు ఇస్తానని ఆశ చూపారు. అంతేకాదు 25 లక్షల వరకు సదరు వ్యక్తి వద్ద డబ్బులు కూడా తీసుకున్నారు. రోజులు గడుస్తున్నా.. ఎంతకీ తనకు ఆస్తి దక్కకపోవడం, డబ్బులు రాకపోవడంతో.. సొంత పార్టీ వారే నమ్మించి ముంచేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నం చేశారు. రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు.. తనకు న్యాయం చేయాలని వేడుకొంటున్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తనని నమ్మించి మోసం చేశారంటూ మనస్తాపంతో ఆ పార్టీ కార్యకర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన తూర్పు గోదావరి జిల్లా చాగల్లు మండలం కలవలపల్లిలో జరిగింది. మోర్త గ్రామానికి చెందిన కృష్ణారావు కలవలపల్లిలో పొలం కొన్నారు. ముళ్లపూడి రమణారావు అనే రైతుకి పొలాన్ని కౌలుకి ఇచ్చారు. అయితే ఈ పొలంలోని కొబ్బరి కాయల్ని కలవలపల్లికి చెందిన ఐదుగురు వైఎస్సార్సీపీ నాయకులు కోయించేశారు. దీనిపై రైతులు కృష్ణారావు, రమణారావు.. చాగల్లు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
"మాది కలవలపల్లి గ్రామం. జనవరి నెలలో మా నాయకులు నన్ను పిలిచారు. పొలం స్వాధీనం చేసుకుంటున్నాం.. దానికి సహకరించమని అడిగారు. అలాగే నా దగ్గర ఉన్న డబ్బులు.. నా భార్య నాలుగు సంవత్సరాల నుంచి మస్కట్ నుంచి పంపించిన డబ్బులు అన్నింటిని వాళ్లకిచ్చాను. ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వకపోవడంతో చాలా బాధేసింది. నా భార్యబిడ్డలకు సమాధానం చెప్పలేక ఆత్మహత్య చేసుకున్నాను. నాకు న్యాయం చేయండి."-నాగరాజు, బాధితుడు
ఈ క్రమంలో రైతులపై కక్ష పెంచుకున్న.. వైఎస్సార్సీపీ నాయకులు అదే గ్రామానికి చెందిన నాగరాజును ఒప్పించి.. కృష్ణారావు, రమణారావులపై SC, ST కేసు పెడితే ఎకరం పొలం, డబ్బులు ఇస్తామని.. ఆశ చూపారు. అంతేకాక నాగరాజును నమ్మించి అతడి వద్ద నుంచి 25 లక్షల రూపాయలు తీసుకున్నారు. చాలా రోజులు వేచిచూసిన నాగరాజు.. ఎంతకీ డబ్బు ఇవ్వకపోవడంతో మనస్థాపానికి గురై.. కొవ్వూరు మండలం నందమూరు శివారులో పురుగుల మందు తాగి నేరుగా డీఎస్పీ కార్యాలయానికి వచ్చారు. వెంటనే డీఎస్పీ కార్యాలయ సిబ్బంది అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కౌలుకు తీసుకున్న పొలంలో పంట కోసుకెళ్లడమే కాకుండా.. వైఎస్సార్సీపీ నాయకులు తనపై అట్రాసిటీ కేసు పెట్టించారని రైతు ముల్లపూడి రమణారావు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే నాగరాజు ఆత్మహత్యకు యత్నించేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈవ్యవహారంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుల ఆగడాలను అరికట్టి తమకు న్యాయం చేయాలని నాగరాజు బంధువులు డిమాండ్ చేస్తున్నారు.