రాష్ట్రంలో మార్కెటింగ్ వ్యవస్థను గ్రామీణ స్థాయి నుంచే బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు అన్నారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రమణయ్యపేటలోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడారు. నాడు-నేడు విధానంలో మార్కెట్ యార్డులన్నింటినీ ఆధునికీకరించనున్నట్లు వెల్లడించారు. గ్రామాల్లో శాశ్వత బహుళ ప్రయోజన(మల్టీ పర్పస్ ఫెసిలిటీ) కేంద్రాలను తీసుకురానున్నట్లు కన్నబాబు తెలిపారు. ఈ కేంద్రాల్లో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల గోదాం, కోల్డ్ స్టోరేజీలు, కస్టమ్ హైరింగ్ కేంద్రాలు, ప్రాథమిక శుద్ధి యూనిట్లు, పాల సేకరణ, పాల నిల్వకు శీతలీకరణ యూనిట్లు తదితరాలు ఉంటాయని వివరించారు.
అలాగే రాష్ట్రంలో పది రొయ్యల శుద్ధి యూనిట్లను కూడా నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మొత్తం వ్యవస్థలకు రూ.9,932 కోట్ల వ్యయం అంచనా వేసినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలోనూ రైతులకు అవసరమైన అన్ని మౌలిక వసతులు అందుబాటులో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యమన్నారు. త్వరలో 15 వేల జనతా బజార్లు ఏర్పాటు కానున్నాయని మంత్రి వెల్లడించారు. నివర్ తుపానుకు సంబంధించి డిసెంబర్ 15 నాటికి పంట నష్టాల తుది నివేదికలు రూపొందించి, నెలాఖరుకు పెట్టుబడి రాయితీని రైతుల ఖాతాల్లో జమ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.
ఇదీ చదవండి: