విజయవాడ నుంచి రాజమహేంద్రవరం మధ్య 190 కిలోమీటర్ల జాతీయ రహదారి(16) ఉంది. ప్రస్తుతం ఈ రహదారి అధ్వానంగా తయారైంది. వాహనాలు రహదారి దిగకుండా... ఇరువైపులా క్రాష్ బ్యారియర్స్ ఉంటాయి. మలుపులు, ప్రమాదకరమైన ప్రాంతాల్లో వాటిపై రేడియం స్టిక్కరింగ్ వేస్తారు. కానీ ఎన్‌హెచ్-16పై చాలా చోట్ల ఈ క్రాష్ బ్యారియర్స్ దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదు. ఫలితంగా వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయి. రహదారిపైకి పిచ్చి మొక్కలు వచ్చేసినా... వాటిని తొలగించకపోవడం నిర్వహణలోపానికి పరాకాష్ట.
జాతీయ రహదారి దెబ్బతింటే... ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయాలి. బాగా పాడైతే అక్కడ పాత లేయర్ తొలగించి కొత్త లేయర్ వేయాలి. రహదారికి ఇరువైపులా పిచ్చి మొక్కలు తొలగించాలి. డివైర్ మధ్యలోనూ నిర్వహణ బాగుండాలి. కానీ అవన్ని జరగడంలేదు. ఎన్‌హెచ్‌ఏఐ నిబంధనల ప్రకారం ఈ రహదారిపై వాహనాలు 100 కి.మీ. వేగంతో దూసుకుపోయేలా నిర్మించారు. గుంతల కారణంగా వాహనాలు ఆ వేగంతో వెళ్లడం సాధ్యపడడం లేదు.
విజయవాడ నుంచి రాజమహేంద్రవరం వరకు 4 టోల్‌ప్లాజాలు ఉన్నాయి. టోల్ రుసుము వసూలులో రాజీపడని గుత్తేదార్లు, ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు దెబ్బతిన్న చోట్ల రహదారి మరమ్మతులపై దృష్టి పెట్టడం లేదు. గతంలో ఇలాగే రహదారి గుంతలు తేలినా... మరమ్మతులు చేయకపోవడంపై పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఓ నేత ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయకుండా టోల్ వసూలు చేస్తే సహించబోనని కలపర్రు టోల్‌ప్లాజా వద్ద గట్టిగా హెచ్చరించారు. ఆ హెచ్చరికతో అప్పట్లో ఆగమేఘాలపై మరమ్మతులు చేశారు. తర్వాత పట్టించుకోవడం లేదు.
ఈ రహదారిపై ప్రయాణం నరకయాతన... అని వాహనదారులు వాపోతున్నారు. గుంతలమయమైన ఈ రహదారిపై ప్రయాణిస్తే... ఆసుపత్రి పాలవుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, గుత్తేదారులు స్పందించి... రహదారి మరమ్మతులు చేయాలని కోరుతున్నారు.