తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా మూడు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ వచ్చిన వ్యక్తుల కుటుంబీకులను అధికారులు క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. పి.గన్నవరంలో ముందస్తుగానే 50 పడకలతో క్వారంటైన్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ మృత్యుంజయరావు వెల్లడించారు. ప్రత్తిపాడు మండలంలో 40 మందిని అన్నవరంలో ఏర్పాటుచేసిన క్వారంటైన్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. గత రాత్రి కాకినాడలో కరోనా పాజిటివ్ నమోదైన వ్యక్తి.. వారం క్రితం ప్రత్తిపాడు మండలం ఒమ్మంగిలో తన సామాజిక వర్గానికి చెందినవారితో కలిసి ప్రత్యేక ప్రార్ధనలు చేశాడు. అతనికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కాగా.. ముందు జాగ్రత్త చర్యగా ఒమ్మంగి గ్రామానికి చెందిన 30 మందిని, చుట్టు పక్కల గ్రామాలు వాకపల్లి, శరభవరం, ఉత్తరకంచి, ప్రత్తిపాడు రాయవరం గ్రామాలకు చెందిన మరో 10 మందిని క్వారంటైన్‌కు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతానికి ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించకున్నా. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు, వైద్య సిబ్బంది తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
కేంద్ర పాలిత యానాంకు.. గతవారం హైదరాబాద్ నుంచి వచ్చిన కాజులూరు మండలం పేకేరు గ్రామానికి చెందిన యువజంటకు పరీక్షలు నిర్వహించారు. 14 రోజులు యానాంలోని అతిథి గృహంలో ఉండేలా ఏర్పాటు చేశారు. ఈ జంట రాత్రి సమయంలో బయటకు వచ్చి వారి స్వగ్రామం పారిపోయారు. ఎట్టకేలకు వారిని గుర్తించి తిరిగి తీసుకొచ్చి యానాం ఎస్పీ భక్తవత్సలం కౌన్సెలింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఇలా ప్రవర్తిస్తే.. క్రిమినల్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.