సామాన్యుడు రైతు బజార్లో కూరగాయలు కొనలేని పరిస్థితి. టమాటాలు మినహా మిగతా కూరగాయల ధరలు నెలరోజులుగా పెరుగుతూనే ఉన్నాయి. స్థానికంగా దిగుబడి తగ్గిపోవడంతో వినియోగదారులకు అందుబాటులోలేవు. పచ్చిమిర్చి గతంలో ఎన్నడూ లేని విధంగా పెరిగింది. మిగతా కూరగాయల ధరలు కూడా నెలరోజుల్లో 10రూపాయల వరకు పెరిగాయి. బహిరంగ మార్కెట్లలో మరింత ప్రియంగా ఉన్నాయి.
ఇంతవరకు సరైన వర్షాలు పడకపోవటం... ఇప్పట్లో కొత్త పంటలు అందుబాటులోకి వచ్చే అవకాశాలు కనిపించట్లేదు. ఎండలకు పాదులు, మొక్కలకు పూత రాలిపోయి కూరగాయల దిగుబడి తగ్గిపోయింది. వర్షాలు పడితే ధరలు తగ్గుముఖం పడతాయని రైతులు అంటున్నారు. ప్రస్తుతం స్థానికంగా తక్కువ మొత్తంలో కొన్ని రకాల కూరగాయలు వస్తున్నాయని.. కొత్త పంట రావడానికి నెల రోజులు పడుతుందని రైతులు చెబుతున్నారు.
రైతు బజార్ లోనే ధరలు పెరుగుతుంటే మధ్యతరగతి ప్రజలకు కూరగాయలు కొనడం చాలా కష్టంగా ఉందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు వంద రూపాయలకు సంచి నిండా కూరగాయలు వచ్చేవని.. ఇప్పుడు అవే కూరగాయలు 300 పెట్టినా రావడంలేదని అంటున్నారు.
స్థానిక పంటల దిగుబడి తగ్గిపోవటం వల్ల మార్కెట్లకు కూరగాయలు తక్కువగా వస్తున్నాయని ఎస్టేట్ అధికారి సుబ్బారావు తెలిపారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవటం వల్ల ధరలు పెరిగాయని.. జూలై నెలాఖరు వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
కొండెక్కిన కూరగాయల ధరలు మధ్యతరగతి ప్రజలకు పెను భారంగా మారింది. రోజు రోజుకు పెరుగుతున్న కూరగాయల ధరలతో సామాన్యులు విలవిల్లాడుతున్నారు. కూలి పని చేసుకుంటూ తెచ్చిన సొమ్ము.. కూరగాయలకే సరిపోతే తమ బతుకులు సాగేదెలా అని సామాన్యుడి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.