తూర్పుగోదావరి జిల్లా యూ. కొత్తపల్లి మండలంలోని అమీనాబాద్ తీరంలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. గతేడాది డిసెంబర్‌లో ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ విధానంలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కరోనా, ఇతర సాంకేతిక కారణాల వల్ల ఇన్నాళ్లు పనుల్లో జాప్యం జరిగింది. అమీనాబాద్ వద్ద నిర్మాణాలు పూర్తయితే.. 15 వేల మంది మత్సకారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకనుంది.
ఈ హార్బర్ ద్వారా లక్షా 10 వేల 600 మెట్రిక్ టన్నుల అదనపు మత్స్య సంపద సేకరణకు అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇన్నాళ్లు ఉప్పుటేరులో నిలిపే వందల పడవలకు జెట్టి , మత్స్య సంపద వేలం, వలలు భద్రపరచడానికి సౌకర్యం కలగనుంది. పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు.. నేడు హార్బర్ ను సందర్శించి, పనుల ప్రగతిని సమీక్షించనున్నారు.