తూర్పుగోదావరి జిల్లా అడ్డతీగల మండలం పింజరకొండ వాగులో ఇద్దరు గల్లంతయ్యారు. రంపచోడవరం ఏఎస్పీ బిందుమాధవి తెలిపిన వివరాల ప్రకారం... జడ్డంగి పోలీసు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ వాసంశెట్టి సింహాద్రి అప్పలరాజు, రాజమహేంద్రవరం వన్‌టౌన్ స్టేషన్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బాపనమ్మ దంపతులు. వీరివురూ తమ ఇద్దరు పిల్లలతో సరదాగా గడిపేందుకు ఆదివారం పింజరకొండ వద్దకు వచ్చారు.
సమీపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు దంపతులిద్దరూ వెళ్లారు. వాగు ఒడ్డున ఉన్న పిల్లలిద్దరిలో తొమ్మిదేళ్ల మౌనసాయిశ్రీ వాగులోకి దిగింది. వాగు ఉద్ధృతికి కొట్టుకుపోతుండగా వారివెంట డ్రైవర్‌గా వచ్చిన మహేశ్ అనే వ్యక్తి కాపాడేందుకు వాగులో దూకాడు. ప్రవాహ ఉద్ధృతితో ఇద్దరూ గల్లంతయ్యారు. రాత్రి వరకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. సోమవారం కూడా గాలింపు చర్యలు చేపడతామని ఏఎస్పీ తెలిపారు.
ఇదీచదవండి