కాకినాడ నగరపాలకసంస్థ నగర మేయర్ సుంకర పావని, ఉపమేయర్-1 కాలా సత్తిబాబుపై ప్రతిపాదించిన అవిశ్వాసంపై ఓటింగ్ నిర్వహించనున్నారు. వీరిని పదవుల నుంచి దింపేందుకు... అవిశ్వాసం ప్రకటించేందుకు 33 మంది కార్పొరేటర్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌కు లేఖలు అందజేశారు. ఉదయం 11 గంటలకు మేయర్, 12 గంటలకు ఉపమేయర్-1 పై ప్రతిపాదించిన అవిశ్వాసానికి సంబంధించిన ఓటింగ్ నిర్వహించనున్నారు. 2017 లో జరిగిన కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో తెదేపా అత్యధిక సీట్లు గెలిచి మేయర్, ఉపమేయర్ స్థానాలను దక్కించుకుంది. తెదేపాకు చెందిన 21 మంది కార్పొరేటర్లు ఇటీవల తిరుగుబాటు బావుటా ఎగురవేశారు.
నాలుగేళ్ల పదవీ కాలం తర్వాత మేయర్, ఉపమేయర్ను మార్పు చేసుకోవచ్చన్న చట్టంలోని అవకాశాన్ని ఉపయోగించి తెదేపా అసమ్మతి కార్పొరేటర్లు, ఇద్దరు భాజపా, ఇద్దరు స్వతంత్య్ర, ఎనిమిది మంది వైకాపా కార్పొరేటర్లతో అవిశ్వాస అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారు. మేయర్, ఉపమేయర్-1 కు అనుకూలంగా ఓటు వేయాలని తెదేపా అదిష్ఠానం ఇప్పటికే ఆ పార్టీ గుర్తుపై గెలిచిన 31 మంది కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. ప్రత్యేక సమావేశానికి హాజరుకావొద్దని భాజపా తమ ఇద్దరు కార్పొరేటర్లకు విప్ జారీ చేసింది. పాలకమండలి పదవీ కాలం అయిదేళ్లు పూర్తి కాకుండానే కార్పొరేషన్లో పాగా వేసేందుకు వైకాపా ప్రయత్నిస్తోంది.
ఇదీ చదవండి: