తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు చెందిన పాత కౌన్సిల్ కార్యాలయంలో మంగళవారం జరిగిన చోరీ సంఘటన పలు అనుమానాలను రేకెత్తిస్తోంది. గతంలో అకౌంటెంట్ కార్యాలయంగా వినియోగించిన గదిలో సేఫ్ లాకర్‌లో ఉంచిన రూ.10.11 లక్షలు చోరీకి గురికావడం వెనక భద్రత లోపం కనిపిస్తోంది. వాస్తవానికి పక్కనే ఉన్న మున్సిపల్ ట్రెజరీ కార్యాలయానికి పన్నుల రూపంలో వచ్చిన ధనాన్ని రోజూ మధ్యాహ్నం బ్యాంకుకు తరలిస్తారు. రెండు రోజులు సెలవులు రావడంతో ముందు రోజు వచ్చిన సొమ్మును లాకర్‌లో పెట్టారు. అకౌంటెంట్ కార్యాలయంలో ఉన్న లాకర్‌కు ఎటువంటి భద్రత లేదు. మున్సిపల్ భవనం మొత్తానికి ప్రతి షిఫ్ట్‌లో ముగ్గురు చొప్పున సెక్యూరిటీ గార్డులు పనిచేస్తారు. వీరంతా ప్రధాన భవనం వద్దకే పరిమితమవుతారు. సీసీ కెమెరాలు బయట మాత్రమే ఉన్నాయి. అకౌంటెంట్ గది వెనక వైపు కిటికీ ఊచలు తొలగించి లాకర్‌ను ఎత్తుకెళ్లారు
ఇంటి దొంగలపై అనుమానాలు?
భద్రత లోపాలు విషయం పసిగట్టినవారు చోరీకి ప్రయత్నించే అవకాశాలపై పోలీసులు అనుమానిస్తున్నారు. ఎవరైనా ఉద్యోగులు సొమ్ము అత్యవసరమై తీసుకొని, సెలవులు తర్వాత మళ్లీ ఏర్పాటు చేస్తే సరిపోతుందనే ఉద్దేశంతో కూడా ఇలా చేయవచ్చని భావిస్తున్నారు. ఈలోగా గిట్టనివారు వ్యవహారాన్ని బట్టబయలు చేశారనే దానిపై ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. సంఘటనకు ముందు రుడా కార్యాలయం మరమ్మతులకు బయట వ్యక్తులు వచ్చారు. తాజాగా రుడా భవనం ప్రారంభంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. ఈ అంశాలపై కూడా దృష్టిపెట్టినట్లు పోలీసులు వివరించారు.
ఇదీ చదవండి: lokesh: 'పోలవరం నిర్వాసితులకు న్యాయం జరిగేదాకా పోరాడుతా'