సినిమా.. అభిమానులు, ప్రేక్షకులను ఆనందపరచడమే కాదు.. ఎంతోమందికి జీవనాధారం కూడా. ప్రొజెక్ట్ ఆపరేటర్లు, బుకింగ్ క్లర్కులు, గేట్ మెన్లు, చిరు వ్యాపారులు ఇలా ఎంతోమంది ఈ రంగంపై ఆధారపడి బతుకుతారు. అలాంటి వారిని కరోనా కష్టాల పాలు చేసింది. తెరపై బొమ్మపడి 100 రోజులు అయ్యింది. పనిలేక, ఆదాయం రాక వారు నానా కష్టాలు పడుతున్నారు.
తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం, కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ కలిపి 10 సినిమా థియేటర్లు ఉన్నాయి. కరోనా కారణంగా మార్చి 22 నుంచి హాళ్లు మూతపడ్డాయి. ఇప్పటికీ పెద్ద తెరపై బొమ్మ పడలేదు. ఈ ప్రభావం థియేటర్ సిబ్బందిపై తీవ్రంగా పడింది. ప్రతి హాలులో దాదాపు 20 మంది వరకు రోజువారీ ఉపాధి పొందుతుంటారు. క్లర్కులు, సైకిల్ స్టాండ్ ఆపరేటర్లు, చిరు తిళ్లు అమ్ముకునేవారు ఇలా సినిమాపై ఆధారపడి బతికేవారు ఎందరో ఉన్నారు. వీరంతా 3 నెలలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. థియేటర్ యాజమాన్యం కొంతవరకూ సహాయం చేసినా కుటుంబ పోషణ భారంగానే ఉందంటూ వాపోతున్నారు.
ఇప్పుడు లాక్ డౌన్ ఆంక్షలు సడలించినప్పటికీ థియేటర్లకు మాత్రం అనుమతి లేదు. తామంతా ఏళ్ల తరబడి హాళ్లను నమ్ముకునే బతుకుతున్నామని.. ఇప్పుడు తమకు వేరే ఉపాధి మార్గం దొరకట్లేదని చెప్తున్నారు. థియేటర్లో బొమ్మ ఎప్పుడు పడుతుందో.. తమ కష్టాలు ఎప్పుడు తీరతాయో అనుకుంటూ ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇవీ చదవండి... : జీతం లేక.. కూలి పనులు చేస్తున్న అధ్యాపకుడు