Dangerous road : అది ఏటిపట్టు గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి. నిత్యం వేల సంఖ్యలో దూసుకెళ్లే వాహనాలు... మూడున్నరేళ్లుగా ఛిద్రమైన రహదారిపైనే ప్రమాదకరంగా ప్రయాణం. రెండేళ్ల గడువుతో రహదారి విస్తరణ పనులు చేపట్టగా.. గడువు పూర్తవుతున్నా నిర్మాణం మాత్రం పూర్తి కాలేదు. తూర్పు గోదావరి జిల్లాలో ప్రాధాన్యమైన సీతానగరం-రాజమహేంద్రవరం రహదారి దుస్థితి ఇది.
రాజహేంద్రవరం-సీతానగరం ఆర్అండ్బీ రహదారిపై ప్రయాణం వాహనదారులకు నరకంగా మారింది. రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరు నుంచి సీతానగరం వరకు కేవలం 18.2 రెండు కిలోమీటర్ల పనులు రెండేళ్ల క్రితం ప్రారంభమయ్యాయి. రహదారి విస్తరణకు రూ.52 కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. తొర్రేడు, బొబ్బిలంక వద్ద సుమారు మూడు కిలోమీటర్ల మేర తారుతో రహదారి వేశారు. మట్టి పూడిక, కంకర పనులు కొంతమేర పూర్తి చేశారు. ఆ తర్వాత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వెంకటనగరం, తొర్రేడు, బొబ్బిలంక, జాలిమూడి, కాటవరం, మునికూడలి, వెదుళ్లపల్లి, రాజంపేట, ఇనుగంటివారిపేట, రఘుదేవపురం, ముగ్గళ్ల, సీతానగరం వరకు ప్రయాణం తీవ్ర ఇబ్బందికరంగా మారింది. గోతులతో కూడిన ధ్వంసమైన దారిలో దుమ్ము, ధూళిలో కుదుపులతో కూడిన ప్రయాణంతో వాహనదారుల ఒళ్లు హూనమౌవుతోంది.
రోడ్డంతా దారుణంగా ఉంది. వెళ్లేటపుడు, వచ్చేటపుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది. సగం వేశారు. సగం ఆపేశారు. ముసలోళ్లు, గర్భిణులు ఎలా వెళ్లాలి. ఈ రోడ్డులో ప్రయాణం చేస్తే సాయంత్రానికి జ్వరం వచ్చేస్తుంది.. - వాహనదారులు
దాదాపు నలభై శాతం పనులు పూర్తి చేసినా బిల్లులు చెల్లించక పోవడంతో గుత్తేదారుడు పనులు నిలిపి వేశారు. బొబ్బిలంక వద్ద సిమెంట్ రోడ్డు వేసే భారీ వాహనం నిలిపి వేసి మరీ పనులు ఆపేశారు. అలాగే రహదారి విస్తరణ పనుల కోసం నిల్వ చేసిన భారీ కంకర గుట్టలు దర్శనమిస్తున్నాయి. రాజమహేంద్రవరం నుంచి సీతానగరం మీదుగా పురుషోత్తపట్నం వరకు గోదావరి ఏటిపట్టు గ్రామాలకు వెళ్లాలంటే ఈ రోడ్డు పైనే రాకపోకలు సాగించాలి. మూడున్నరేళ్లుగా ఈ గ్రామాల ప్రజలు తీవ్రంగా ధ్వంసమైన దారిలోలోనే ప్రయాణం సాగిస్తున్నారు. గోదావరి వరద తగ్గడంతో ఇసుక రవాణా చేసే భారీ టిప్పర్లు దుమ్ము రేపుతూ దూసుకెళ్తున్నాయి. దీంతో వాహనదారులతోపాటు రహదారి వెంట ఉన్న ఇళ్లన్నీ దుమ్ము, దూళితో నిండిపోతున్నాయి. ఈ రూట్ లో ప్రయాణించలేక కొందరు కోరుకొండ మీదుగా చుట్టూ తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటున్నారు.
సీతానగరం-రాజమండ్రి రోడ్డు అంటేనే భయంగా ఉంటుంది. రోడ్డంతా గుంతలమయం. బండ్లు రిపేరుకు వస్తున్నాయి. గుంతల్లో పడి బేరింగులు పోతున్నాయి. ఇంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నా రోడ్లు పట్టించుకునే నాథుడే లేడు. - వాహనదారులు
కొన్ని చోట్ల భూ సేకరణ సమస్య కూడా ఉంది. విద్యుత్ శాఖకు బాకాయిలు చెల్లించక పోవడంతో కరెంటు స్తంభాలు అలాగే ఉంచి కొన్ని చోట్ల రోడ్డు నిర్మించారు. వర్షాకాలంలో ఈ దారిపై ప్రయాణం అత్యంత ప్రమాదకరం. వాతావరణం అనుకూలంగా ఉన్న సమయంలోనైనా రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని వాహనదారులు, స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.