తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఉద్రిక్తతకు దారితీశాయి. రిటర్నింగ్ ఆఫీసర్(ఆర్వో) ఏకపక్షంగా వ్యవహరించారని అర్ధరాత్రి వేళ తెదేపా శ్రేణులతో కలిసి గ్రామస్థులు నిరసన చేశారు. గ్రామంలోని ఏడు వార్డులు తెదేపా మద్దతుదారులు, మూడు వార్డులు వైకాపా సానుభూతిపరులు గెలుచుకున్నారు. వైకాపా మద్దతురాలు 16 ఓట్ల తేడాతో సర్పంచి స్థానాన్ని దక్కించుకున్నారు. రీకౌంటింగ్ నిర్వహించాలంటూ ప్రత్యర్థి కోరగా... ఆర్వో నిరాకరించాడు. ఆగ్రహించిన ప్రజలు తెదేపా వర్గీయులతో కలిసి.. న్యాయం చేయాలంటూ పోలింగ్ కేంద్రం వద్ద నిరసన చేపట్టారు.
తెదేపా మద్దతుదారుడు ఒకరు పెట్రోలు పోసుకొని చేసిన ఆత్మహత్యయత్నాన్ని స్థానికులు అడ్డుకున్నారు. డీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. విషయం తెలుసుకున్న తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు జ్యోతుల నెహ్రూ పోలింగ్ కేంద్రానికి చేరుకుని రీకౌంటింగ్ చేపట్టాలని ఆర్వోకు వినతిపత్రం ఇచ్చారు. అధికారి దాన్ని తిరస్కరించటంతో మరోమారు తెదేపా శ్రేణులు నిరసనకు దిగారు. వారికి నెహ్రూ నచ్చజెప్పారు.
తెదేపా మద్దతుదారులు వార్డు మెంబర్స్‌గా గెలిచినప్పుడు మూడు వార్డుల్లో రీకౌంటింగ్ చేసిన ఆర్వో.. సర్పంచికి ఎందుకు చేయట్లేదని నెహ్రూ మీడియా ముందు ప్రశ్నించారు. ఆర్వో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌంటింగ్ సమయంలో ఆర్వో ఫోన్ మాట్లాడారని.. తెదేపా మద్దతుదారులకు చెందిన వంద ఓట్లు చెల్లనివంటూ తొలగించారని నెహ్రూ ఆరోపించారు. అధికారి ఫోన్ కాల్స్ డేటాపై విచారణ జరిపించాలని.. న్యాయం కోసం పోరాడతామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: వైకాపా ప్రభుత్వ పతనానికి నాంది.. ఈ ఎన్నికలు: చంద్రబాబు