పై మాటలు చాలవా...ఓ మనిషి చేసిన నిస్వార్థ, నిర్విరామ సేవలు తెలియజేయడానికి..! కుమారులే పట్టించుకోనప్పుడు ఎందరి ఇళ్లకో పెద్దకుమారుడిలా నిలిచిన ఆయన గొప్పతనానికి... ఈ నిదర్శనం చాలదా...!
తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీ గ్రామానికి చెందిన శ్యాంకుమార్ కుటుంబం...కొవిడ్ రెండు దశల్లోనూ అమూల్యమైన సేవలందించింది. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన శ్యాంకుమార్‌కు...ఇంద్రజాలం ప్రవృత్తి. స్థానికంగా వీరి కుటుంబాన్ని మ్యాజిక్ ఫ్యామిలీగా పిలుస్తారు. సామాజిక కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుంటారు. ఎయిడ్స్‌పై అవగాహన కల్పించిన శ్యాంకుమార్ సేవలకు గుర్తింపుగా పలు పురస్కారాలు వచ్చాయి. నాలుగుసార్లు ఉత్తమ ఉపాధ్యాయుడి పురస్కారాలు వరించాయి. అడల్ట్ ఎడ్యుకేషన్‌పై యూనిసెఫ్ నుంచి రెండుసార్లు అవార్డులు అందుకున్నారు.
కొవిడ్ సమయంలో మరింత బాధ్యతను భుజాలకెత్తుకున్నారు. కరోనా తొలి దశలో 90 రోజుల పాటు బాధితులు, పేదలు, వలస కూలీలకు 20 వేల భోజన పొట్లాలు అందించారు. రెండో దశలోనూ అవగాహన కల్పిస్తూ సేవలు కొనసాగిస్తున్నారు. స్థానిక ANMల ద్వారా బాధితులకు ఆహారాన్ని అందిస్తూ వస్తోంది శ్యాంకుమార్ కుటుంబం. వారే తమ ప్రాణాలు కాపాడారని బాధితులు కృతజ్ఞతలు చెబుతున్నారు. జిల్లాలో కరోనా ముప్పు పూర్తిగా తొలిగేవరకూ సేవలు కొనసాగిస్తానని శ్యాంకుమార్ అంటున్నారు.
ఇదీచదవండి