TDP Leaders Protest on CBN Security in Jail: రాజమహేంద్రవరం కారాగారంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రాణాలకు రక్షణ లేదని, ప్రమాదం ఉందని ఆ పార్టీ నేతలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. జైలు సూపరింటెండెట్‌ను బదిలీ చేస్తున్నామని వైసీపీ లీకులిస్తోందని మాజీ హోం మంత్రి చినరాజప్ప మండిపడ్డారు. సీఎం జగన్ జైలును కూడా తమ కంట్రోల్లోకి తీసుకునే కుట్ర పన్నాడని ఆరోపించారు. జైలు లోపలి అంశాలు ఎప్పట్టికప్పుడు సాక్షి, దానికి అనుబంధంగా ఉన్న మీడియాకి అందిస్తున్నారని ధ్వజమెత్తారు.
జరుగుతున్న పరిణామాల పట్ల రాజ్యాంగ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో పలు మార్లు చంద్రబాబు పర్యటనల్లో జరిగిన దాడులపై రాష్ట్ర పోలీసులు ఉదాసీన వైఖరి ప్రదర్శించారని తెలుగుదేశం నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బస్ మీద వైసీపీ మూకలు రాళ్లు, చెప్పులతో దాడి చేస్తే చేయగా.. అది నిరసన తెలపడంలో భాగమని, వారి భావ ప్రకటన స్వేచ్ఛని ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రకటించారని మండిపడ్డారు.
నందిగామ, యర్రగొండ పాలెం పర్యటనల్లో చంద్రబాబు మీద జరిగిన రాళ్ల దాడిలో ఎన్ఎస్జీ కమాండోల తలకు గాయాలయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుత మంత్రి జోగి రమేశ్ గతంలో చంద్రబాబు ఇంటి మీదకు దాడికి వస్తే పోలీసులు అది దాడి కాదని సమర్ధించుకుని కనీసం కేసు పెట్టలేదని ధ్వజమెత్తారు. పల్నాడు ఆత్మకూరు పర్యటనకు చంద్రబాబు వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులే ఆయన ఇంటి గేట్‌కు తాళ్లు కట్టి బయటకు రాకుండా అడ్డుకున్నారని దుయ్యబట్టారు.
ప్రకాశం బ్యారేజ్ గేట్‌కు బోట్ అడ్డంపెట్టి చంద్రబాబు ఇల్లు ముంచాలని విశ్వప్రయత్నం చేసారని ఆరోపించారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో చంద్రబాబు ఇంటిపై డ్రోన్లు ఎగరవెస్తే పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్జీ రక్షణ తీసేస్తే ఫుట్‌బాల్ తన్నినట్టు తంతానని మాజీ మంత్రి కొడాలి నాని వ్యాఖ్యానించారని, ఎన్ఎస్జీ రక్షణ తీసివేయమని తానే కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారని దుయ్యబట్టారు.
Protests Against Chandrababu Naidu Arrest: పెల్లుబికిన ప్రజాగ్రహం.. అడుగడుగునా పోలీసుల అడ్డగింపు
చంద్రబాబు కుప్పం పర్యటనకు వెళ్తే ఎమ్మెల్సీ భరత్ నేతృత్వంలో వైసీపీ శ్రేణులు చేసిన విధ్వంసంపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు. అనుమతి తీసుకుని వైజాగ్ పర్యటనకు వెళ్లిన చంద్రబాబును విమానాశ్రయంలో వైసీపీ మూకలు ముట్టడించి సృష్టించిన అలజడికి పోలీసులు వత్తాసు పలికారని విమర్శించారు. పుంగనూరు పర్యటనకు వెళ్లిన చంద్రబాబుపై అంగళ్లు వద్ద జరిగిన రాళ్ల దాడిలో తిరిగి టీడీపీ నేతలపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారని మండిపడ్డారు.
తూర్పు గోదావరి జిల్లా అనపర్తి పర్యటనలో పోలీసులు సృష్టించిన అలజడి వల్ల చంద్రబాబు కటిక చీకటిలో 8 కిలోమీటర్లు నడిచారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు హాని కలిగించాలనే ప్రభుత్వ పెద్దల క్రూరత్వాన్ని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఏపీ పోలీసుల పూర్తి స్థాయి నిర్లక్ష్యం, పక్షపాత ధోరణి కళ్లకు కట్టినట్లు వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు.
చంద్రబాబు హౌస్ కస్టడీ పిటిషన్‌పై సుదీర్ఘ విచారణ..నిర్ణయం రేపటికి వాయిదా