రాజమహేంద్రవరంలో 'థాంక్యూ సీఎం సార్' పేరిట తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డివాసు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. సీతంపేటలోని ఓ బెల్టు షాపు ఎదుట వివిధ బ్రాండ్ల మద్యం సీసాలు ప్రదర్శిస్తూ ఆందోళన చేపట్టారు. మద్యం అమ్మకాల విషయంలో ప్రభుత్న విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పిన జగన్..రకరకాల బ్రాండ్లు, కల్తీ మద్యం విక్రయాలని ప్రోత్సహిస్తున్నారని ఆదిరెడ్డివాసు విమర్శించారు. ప్రజల ఆరోగ్యంతో ముఖ్యమంత్రి చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. కరోనా సమయంలో తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న జనాల్ని తాగుడుకు బానిసలు చేస్తున్నారన్నారు. యువతకు ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి డిగ్రీలు, పీజీలు చదివిన వారిని మద్యం దుకాణాల్లో పనులు చేయిస్తున్నారని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తేల్చుకునేందుకు తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉందని మరో నేత యర్రా వేణుగోపాలరాయుడు అన్నారు.
ఇదీ చదవండి: ఈ నెల 27న రాష్ట్ర కేబినెట్ భేటీ