ఆంధ్రప్రదేశ్‌లో తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు, సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం జరిగిన నేపథ్యంలో తెదేపా నేతలు బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసానికి పార్టీ త్రిసభ్య బృందం చేరుకుంది.
తెదేపా బృందంలో గద్దె రామ్మోహన్‌రావు, చినరాజప్ప, జవహర్ ఉన్నారు. గోరంట్ల డిమాండ్లను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారు. గోరంట్ల రాజీనామా చేస్తారనే ప్రచారం గురువారం విస్తృతంగా సాగిన విషయం తెలిసిందే. సీనియర్‌గా ప్రాధాన్యం ఇవ్వకపోవడం, పార్టీలో సమస్యలపై సూచనలు పాటించకపోవడం.. బుచ్చయ్య సూచించిన వారికి రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీల్లో ప్రాధాన్యం ఇవ్వకపోవడం వంటివి తాజా పరిణామాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
గోరంట్లతో గంటన్నరసేపు చర్చలు జరిపాం. రాజమహేంద్రవరంలో ఆయనకు ఉన్న ఇబ్బందుల గురించి గోరంట్ల చెప్పారు. ఆయన ఇబ్బందులను అచ్చెన్నాయుడు స్వయంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా బుచ్చయ్య అభిప్రాయాలను చంద్రబాబు పరిగణనలోకి తీసుకుంటారు. చిన్న చిన్న సమస్యలే పరిష్కరించుకుంటాం. -గద్దె రామ్మోహన్‌రావు, తెదేపా
త్వరలో జరగనున్న రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో ఓ వర్గానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే పరిస్థితుల నేపథ్యంలో పార్టీ అధినేత చంద్రబాబు, ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌తో ఫోన్లో మాట్లాడేందుకు గోరంట్ల ప్రయత్నించి భంగపడినట్లు తెలుస్తోంది. చంద్రబాబు, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో ఫోన్లో బుచ్చయ్యతో మాట్లాడించారు. ఏమైనా సమస్యలుంటే కూర్చుని మాట్లాడదామని వాళ్లు చెప్పడంతో సమస్య సద్దుమణిగినట్లయింది.
ఇదీ చదవండి: LIVE: రాజమహేంద్రవరంలో తెదేపా ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి మీడియా సమావేశం