తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాల్లో ఈ ఏడాది పెద్ద ఎత్తున మొక్కజొన్నను రైతులు పండించారు. ప్రత్తిపాడు, జగ్గంపేట, పెద్దాపురం, పిఠాపురం నియోజకవర్గాల్లో ఎక్కువ శాతం రైతులు ఈ పంటను సాగు చేశారు. కత్తెర పురుగు లాంటి చీడపీడలు ఇబ్బందులు పెట్టినా... తక్కువ కాలంలోనే చేతికొస్తుందని, భారీగా లాభాలు వస్తాయనే నమ్మకంతో రైతులు దీన్ని పండించారు. కానీ వారి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. మొక్కజొన్నను కొనేవారు లేక పూర్తి స్థాయిలో డిమాండ్ పడిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది ఒక్కొక్క మొక్కజొన్న కండె రూ.5 నుంచి 6 రూపాయలకు కొన్న వ్యాపారులు... ఈ ఏడాది రూపాయికే అడుగుతున్నారని రైతులు వాపోతున్నారు. కౌలు, దుక్కి, విత్తనాలు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చు కలిపి ఎకరానికి రూ.50 నుంచి రూ. 60 వేలు అయ్యిందని.. ఇలా రూపాయికి అమ్ముకుంటే పెట్టుబడులు కూడా రావంటున్నారు.
మెట్ట ప్రాంతంలో పండిన మొక్కజొన్నను గతంలో తెలంగాణ ప్రాంతంలోని మద్యం ఫ్యాక్టరీలకు సరఫరా చేసేవారమని.. ప్రస్తుతం వారూ పంటను తీసుకోవడం లేదని రైతులు వాపోతున్నారు. విధిలేని పరిస్థితుల్లో స్థానిక వ్యాపారులకే తక్కువ ధరకు ఇచ్చేస్తున్నామంటున్నారు.
మొక్కజొన్నకు మద్దతు ధర ఇప్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి..