ఆహ్లాదానికి నెలవైన గోదారి తీరంపై నిప్పుల వాన పడుతోంది. ప్రకృతి అందాలకు పెట్టింది పేరైన తూర్పు గోదావరిని ఎండ హడలెత్తిస్తోంది. జిల్లాలోని ప్రత్తిపాడు మండలంలో పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఎండ నుంచి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు వివిధ మార్గాలను ఎన్నుకున్నారు. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా సేద తీరుతున్నారు.
సమష్టి పందిళ్లు... సరదాగా ముచ్చట్లు
తూర్పు గోదావరి జిల్లాలోని పల్లెల్లో ఒకప్పటి సంస్కృతికి తెరలేపుతున్నారు కొందరు. వేసవి పుణ్యమా అని అందరూ మళ్లీ ఒకేచోటికి చేరుతున్నారు. గోకవరం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన దుకాణంపై పందిరి వలే తీగను పెంచాడు. ధర్మవరంలో బాబురావు అనే ఓ ఇంటి యజమాని పెద్ద పందిరి ఏర్పాటు చేశాడు. పచ్చని తీగ పందిరి ఇచ్చే చల్లదనం ఏసీ మాదిరిగా ఉందని సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. ప్రత్తిపాడులో ఒక దాత చెట్టు కింద రేకుల షెడ్డుతోపాటు చలివేంద్రం ఏర్పాటు చేశారు. ఆ చెట్టు కింద గ్రామస్తులంతా చేరి ముచ్చట్లు పెట్టుకుంటూ... సేదతీరుతున్నారు. గజ్జనాపూడిలో చెట్టు కింద గ్రామస్తులే తాటాకు పందిరి ఏర్పాటు చేసుకున్నారు. అక్కడే చలివేంద్రంలో నీళ్లు తాగుతూ.. ఆహ్లాదంగా గడుపుతున్నారు. పంతంగి, కొత్తూరు గ్రామాల్లోనూ చెట్ల కింద షెడ్లు ఏర్పాటు చేసుకుని సేద తీరుతున్నారు. వీటితోపాటు ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాల్లో కూడా ఇవే రకమైన చెట్లు, షెడ్లు కనిపిస్తున్నాయి.
కాలువల్లో సేదతీరుతూ...
ప్రత్తిపాడు వాసులు ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో సమీపంలోని కాలువల్లో సేద తీరుతున్నారు. వేసవిలో ఇంతకు మించిన ఉపశమనం మరొకటి ఉండదు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ కాలువల్లోనే గడిపినా.. ఇంటికి రావాలనిపించదు. అంతటి ఆహ్లాదం నీటితో గడపటం వల్లే సాధ్యం. ఇంకొందరు తాటిముజలు, కొబ్బరి బోండాలు సేవిస్తూ ఉపశమనం పొందుతున్నారు.
గోదారి తీరంలో సమష్టి పందిళ్లు, చలివేంద్రాలు... అందరినీ ఆకట్టుకుంటున్నాయి. సూర్యుడి పుణ్యమా అని పల్లెలకు మళ్లీ ఒకప్పటి కళ రావటం సంతోషకరం.
ఇదీ చదవండీ: అమనాం ప్రజల భయమేంటి? అధికారుల గస్తీ ఎందుకు?...