ప్రభుత్వం పంట నష్టం వివరాలను ఎంతో పారదర్శకంగా నిర్వహిస్తోందని.. వ్యవసాయ మిషన్ వైస్ ఛైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం మునగాల, కూనవరం గ్రామాల్లో నీటిలో మునిగిన పంటలను ఆయన పరిశీలించారు. కోరుకొండ, సీతానగరం మండలాల్లో గత 2, 3 నెలల్లో వచ్చిన వరదలకు జరిగిన పంట నష్టం వివరాల నివేదిక రూపొందించి.. రైతు భరోసా కేంద్రాల్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
తుపాన్ల వల్ల తూర్పుగోదావరి జిల్లాలో అధిక పంట నష్టం వాటిల్లిందని నాగిరెడ్డి అన్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వచ్చిన వరదల వల్ల జరిగిన నష్టాల నివేదికలను జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి నివేదించిందని తెలిపారు. ఈ 2 నెలల పరిహారాన్ని రైతుల ఖాతాల్లో వేసిందని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల్లో నష్టపోయిన రైతులు, పంట నష్టం వివరాలు ప్రదర్శించిందని చెప్పారు. నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవడం ప్రభుత్వం బాధ్యతగా భావిస్తోందన్నారు.
పరిహారం అందనివారు ఎవరైనా ఉంటే రైతు భరోసా కేంద్రాల్లో సంప్రదించాలని సూచించారు. రైతుల ఇబ్బందులను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ మిషన్ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తోందని తెలిపారు. ప్రభుత్వానికి, రైతులకు మధ్య తాము వారధిగా ఉన్నామన్నారు. వాస్తవ పరిస్థితులపై రాష్ట్ర ప్రభుత్వానికి సూచనలు చేస్తామని వెల్లడించారు. పంట ముంపునకు గల కారణాలను వివరిస్తూ నియోజకవర్గ ఎమ్మెల్యే సంతకంతో జిల్లా కలెక్టర్ దృష్టికి, వ్యవసాయ శాఖ మంత్రికి అందేలా వినతి పత్రాలు అందించాలని నాగిరెడ్డి రైతులకు సూచించారు.
ఇవీ చదవండి: