తూర్పుగోదావరి జిల్లా మండపేట మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బిక్కిన కృష్ణార్జున చౌదరి సోదరుడి మనుమడు బిక్కిన శ్రీకాంత్(22) సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తండ్రి బిక్కిన చక్రవర్తి వ్యాపారి. తల్లి శ్రీభాను గృహిణి. కరోనా కారణంగా శ్రీకాంత్ ఇంటికి వచ్చేశాడు. గతనెల 24న పుట్టినరోజు సందర్భంగా బంధువులను కలుసుకునేందుకు బైక్‌పై యండగండి బయల్దేరాడు. వెదురుమూడి వద్ద ప్రమాదానికి గురై రోడ్డుపై పడిపోయాడు. మూడు గంటల అనంతరం మండపేటలోని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్సకు రాజమహేంద్రవరం తరలించారు. నెల రోజులు చికిత్స అందించినా కోలుకోలేదు. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ క్రమంలో మరికొందరి ప్రాణాలు కాపాడేందుకు, తమ కుమారుడి అవయవాలను దానం చేసేందుకు వారు ముందుకొచ్చారు. ఇక్కడ సదుపాయం లేకపోవడంతో రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం శస్త్రచికిత్స చేసి గుండె ఒకరికి, కాలేయం మరొకరికి, కిడ్నీలు ఇద్దరికి దానం చేశారు. నలుగురి ప్రాణాలు కాపాడినందుకు తెలంగాణ ప్రభుత్వం వారికి ప్రశంసాపత్రం ఇచ్చింది. శ్రీకాంత్ మృతదేహాన్ని శనివారం మండపేటకు తీసుకొచ్చి, అంత్యక్రియలు నిర్వహించారు.
ఇదీ చదవండి: టెక్కలిలో మాయ లేడి... ఉద్యోగాల పేరిట కుచ్చుటోపీ!