బాలికపై లైంగిక దాడి, బెదిరింపులకు పాల్పడిన నిందితుడు, సహకరించిన స్నేహితులపై.. పోలీసులు పోక్సో, దిశ చట్టాల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక పోటీ పరీక్షల శిక్షణ తీసుకునేందుకు గతంలో రాజమహేంద్రవరం వెళ్లింది. అక్కడ ఓ కళాశాలలో ఇంజినీరింగ్ చివరి ఏడాది చదువుతున్న పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మణి వెంకట సత్యనారాయణతో పరిచయమైంది. గతేడాది అక్టోబరు 31న అమలాపురం వచ్చిన అతడు ఒక లాడ్జిలో వారం పాటు మకాం వేసి బాలికను గుడికి రప్పించి మాట్లాడాడు. తన కోరిక తీర్చకపోతే ఇంట్లో వారిని చంపేస్తానని భయపెట్టి.. ఆమెపై లైంగిక దాడికి పాల్పడి, నగ్న చిత్రాలు తీశాడు. వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరింపులకు పాల్పడుతుండడంతో ఆ బాలిక మానసికంగా కుంగిపోయింది.
విషయం తెలుసుకున్న ఆమె తల్లిదండ్రులు కొవ్వూరులోని యువకుడి ఇంటికి వెళ్లి నిలదీశారు. అయినప్పటికీ అతడిలో మార్పు రాకపోవడంతో ఈ నెల 12న రాజానగరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దానిని 13వ తేదీన అమలాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌కు బదలాయించారు. దీనిపై కాకినాడ దిశ పోలీసు స్టేషన్ డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేపడుతున్నట్లు అప్పటి స్టేషన్ ఇన్‌ఛార్జి, రూరల్ సీఐ సురేష్‌బాబు మంగళవారం తెలిపారు. నిందితుడికి సహకరించిన 15 మంది స్నేహితులపై దిశ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. వీరిలో ఇద్దరు విద్యార్థినులు కూడా ఉన్నారన్నారు.
ఇదీ చదవండి: లైవ్ వీడియో: షటిల్ ఆడుతుండగా గుండెపోటు.. కోర్టులోనే ప్రాణాలొదిలిన సీఐ