గతంలో నెల మొదటి తేదీనే సామాజిక పింఛన్లు అందేవి. లబ్ధిదారులంతా పంచాయతీ కార్యాలయానికి వచ్చి తీసుకెళ్లేవారు. ఈ నెల మాత్రం ఇంకా డబ్బు చేతికి రాలేదు. పశ్చిమగోదావరి జిల్లాలో అనేక గ్రామపంచాయతీల్లో ఈ దుస్థితి కనిపిస్తోంది. అతికష్టం మీద కార్యాలయానికి రావడం.. వెళ్లడం.. ఇదే జరుగుతోంది. ఎప్పుడిస్తారో తెలియక సరైన సమాధానం రాక అక్కడే కాలం వెళ్లదీస్తున్నారు. నడవలేని స్థితిలో ఆటోఛార్జీలకు డబ్బులులేక బాధలు పడుతున్నారు. ఏలూరు గ్రామీణ మండలంలోనూ ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి.
ఆకలితో పస్తులు..
జిల్లాలో నాలుగున్నర లక్షలమంది లబ్ధిదారులు పింఛన్లు తీసుకొంటున్నారు. వృద్ధులు రెండులక్షలు, వితంతువులు 1.45 లక్షల మంది, దివ్యాంగులు 55వేలమంది ఉన్నారు. జిల్లాలోని 955గ్రామపంచాయతీల్లో 4వందలకుపైగా గ్రామపంచాయతీల్లో పింఛన్ అందలేదు. మిగతాచోట్ల ఆలస్యంగా అందించారు. ఫలితంగా పింఛన్లపై అధారపడి కుటుంబాలు ఆకలితో పస్తులుంటున్నాయి. పింఛన్లపై ఆధారపడి జీవిస్తున్న తమకు సకాలంలో పింఛన్లు అందించి.. ఆదుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
ఇదీ చదవండి : 'చేనేత కళాకారుల కష్టం కొలవలేనిది.. వెలకట్టలేనిది'