కరోనాతో ఆసుపత్రుల్లో సాధారణ పడకలకన్నా ఆక్సిజన్ బెడ్ల సంఖ్య ఎక్కువైంది. ఆసుపత్రుల్లో రీఫిల్లింగ్ లేని చిన్న సిలిండర్లు, ఆక్సిజన్ కొరత కారణంగా సకాలంలో ప్రాణ వాయువు అందక ప్రజలు మృత్యువాత పడిన ఘటనలున్నాయి. దీనిపై ఈ నెల 3న ‘ఈనాడు’లో ప్రచురితమైన ‘ప్రాణం.. విలవిల’ కథనానికి అధికార యంత్రాంగం స్పందించింది. ఇకపై అలాంటి ఇబ్బందుల్లేకుండా రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి 250 రీఫిల్లింగ్ ఆక్సిజన్ సిలిండర్లు, మరో 30 బీ టైపు సిలిండర్లను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది.
దాంతోపాటు ఎప్పటికప్పుడు ఆరు వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటును నింపుతూ దాని పర్యవేక్షణ, ఆక్సిజన్ నిల్వల గుర్తింపునకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. దాంతో రోగుల ఆక్సిజన్ ఇక్కట్లు దాదాపు తొలగినట్లయింది. కొవిడ్ కేసుల తీవ్రత దృష్ట్యా పది వేల లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంటు మంజూరుకు ప్రతిపాదనలు పంపారు.
అందుబాటులోకి 100 వెంటిలేటర్లు
కరోనాకు ముందు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రిలో 10 వెంటిలేటర్లు మాత్రమే అందుబాటులో ఉండేవి. మరో 40, 50 చొప్పున రెండు దఫాలుగా 90 వెంటిలేటర్లను జిల్లా ఆసుపత్రికి మంజూరు చేశారు. కొన్ని హెచ్‌ఎఫ్‌ఎన్‌సీ పరికరాలను కూడా సమకూర్చారు.
“రాజమహేంద్రవరం ప్రభుత్వ కొవిడ్ ఆసుపత్రిలో కలెక్టర్ ఆదేశాలతో ఇప్పటికే సుమారు 280కిపైగా ఆక్సిజన్ సిలిండర్లను కొనుగోలు చేసి అందుబాటులోకి తీసుకొచ్చాం. 10,000 లీటర్ల ఆక్సిజన్ ట్యాంకు నిర్మాణానికి సంబంధించి కలెక్టర్ పరిశీలన చేస్తున్నారు.వెంటిలేటర్లు సైతం జిల్లా కేంద్రం నుంచి ఆసుపత్రికి వచ్చాయి.”
- డాక్టర్ రమేష్‌కిషోర్, డీసీహెచ్‌ఎస్, రాజమహేంద్రవరం
--
ఇవీ చదవండి: