సముద్రంలో చేపల వేటపై ప్రభుత్వం రెండు నెలల నిషేధం విధించింది. చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో... ఏటా ఏప్రిల్ 15 నుంచి జూన్ 14 వరకూ సముద్రంలో చేపల వేటను ప్రభుత్వం నిషేధిస్తుంది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి చెందే సమయం కావడంతో... రెండు నెలలు వేటకు అనుమతించరు. దీనివల్ల తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది, కరవాక, ఓడలరేవు, వాసాలతిప్ప, కాట్రేనికోన, కాకినాడ, ఉప్పాడ, కోనపాపపేట, తొండంగి ప్రాంతాల్లో బోట్లు ఒడ్డుకు చేరాయి. ఎప్పడూ చేపల వేట, విక్రయాలతో సందడిగా ఉండే తీర ప్రాంతాలు ప్రస్తుతం బోసిపోతున్నాయి.
జిల్లాలో 60 వేల వరకు మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి. 35 వేల కుటుంబాలు కేవలం సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. నిషేధ సమయంలో మత్స్యకారులు ఉపాధి కోల్పోతారన్న కారణంగా... ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం 10 వేల రూపాయలను భృతిగా ఇస్తుంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని... ఈ నిషేధ కాలంలో ఎలా బతకాలో తెలియడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వల్ల ఏ పనులూ దొరకడం లేదని.. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు.
ఇదీ చదవండి: లంక భూముల నుంచి మట్టి తరలింపు.. అడ్డుకున్న గ్రామస్థులు
జిల్లా వ్యాప్తంగా 4వేల 600 మోటరైజ్డ్ బోట్లు, 5వేల 400 మెకనైజ్డ్ బోట్లు, 330 సంప్రదాయ పడవలున్నాయి. సంప్రదాయ పడవలపై నిషేధం ఉండదు. మత్స్యకారుల భవిష్యత్ ఉపాధి దృష్టిలో ఉంచుకునే వేట నిషేధం విధిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. మత్స్యకార భరోసా ద్వారా ఇస్తున్న 10 వేల రూపాయల భృతిని సకాలంలో అందించాలని మత్స్యకారులు వేడుకుంటున్నారు.
ఇదీ చదవండి: