జషిత్‌ను ఎవరు అపహరించారన్న అంశం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. చిన్నారిని వదిలేసిన ప్రాంతం కుకుతులూరు.. మండపేట నుంచి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో ఈ ప్రాతంపై ప్రత్యేక దృష్టి సారించారు పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం, బ్యాంకు రుణాలు, ఆర్థిక లావాదేవీల కోణాలతోపాటు ఇతర అంశాలపైనా దర్యాప్తు ముమ్మరం చేశారు. రాజానగరం, మండపేట, అనపర్తి నియోజకవర్గాల్లో నిందితుల కోసం ఎక్కువగా గాలిస్తున్నారు. పిల్లాడు జషిత్ తనను ఇద్దరు వ్యక్తులు ఓ ఇంట్లో ఉంచారని ... అందులో ఒకరి పేరు రాజుగా వెల్లడించాడు. ఆ పేరున్న వ్యక్తుల కోసం గ్రామాల్లో పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. మండపేటలో పోలీసు అధికారులు శుక్రవారం కూడా దర్యాప్తు చేశారు. అలాగే కుటుంబ సభ్యుల్ని విచారించారు. మొత్తం 100 మంది పోలీసులతో 17 బృందాలు... నిందితుల కోసం గాలిస్తున్నాయి. ఏఎస్పీ శ్రీధర్ రావు అధికారులు సిబ్బందితో మండపేట పోలీస్ స్టేషన్లో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించిన ఈ కేసులో నిందితులను పట్టుకోవడానికి ఇంకెంతకాలం పడుతుందో!
చిన్నారి ఇంట్లో కోలాహలం
చిన్నారి జషిత్ ఇంట్లో సందడి వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యులతో పిల్లాడు ఉత్సాహంగా గడిపాడు. అంతా కలసి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తనను పాఠశాలకు పంపించాలని జషిత్ కోరుతున్నాడు.