Janasena Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి యాత్ర బుధవారం ప్రారంభం కానుంది. అన్నవరం సత్యదేవుని దర్శనం తర్వాత పవన్ కల్యాణ్ వారాహియాత్రకు శ్రీకారం చుడతారు. ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి కూడలిలో వారాహి నుంచి తొలి బహిరంగసభ నిర్వహిస్తారు. యాత్రలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో జనవాణి కార్యక్రమంతోపాటు బహిరంగ సభ ఉండేలా ప్రణాళిక రూపొందించారు.
సార్వత్రిక ఎన్నికలకు ఏడాది కన్నా తక్కువ సమయం ఉన్న తరుణంలో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి వాహనం నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు. మొదటి విడతలో ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర సాగనుంది. బుధవారం రత్నగిరిపై కొలువైన సత్యదేవుని దర్శనం తర్వాత ప్రజాక్షేత్రంలోకి పవన్ వస్తారు. వారాహి వాహనంలో ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడి చేరుకుంటారు. అక్కడ బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు.
పవన్ వారాహి యాత్ర గోదావరి జిల్లాల్లోని.. పిఠాపురం, కాకినాడ, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, నరసాపురం నియోజకవర్గాల మీదుగా భీమవరం చేరుకుంటుంది. ప్రతి నియోజకవర్గంలో రెండు రోజుల పాటు యాత్ర సాగనుంది. జూన్ 16న పిఠాపురం, జూన్ 18న కాకినాడ, జూన్ 20న ముమ్మిడివరం, జూన్ 21న అమలాపురం, జూన్ 22న మలికిపురం, జూన్ 23న నరసాపురంలో బహిరంగసభలు నిర్వహిస్తారు.
యాత్రలో భాగంగా నిర్వహించే జనవాణి కార్యక్రమంలో సమస్యలతో కష్టాలు పడుతున్న వారి బాధలను పవన్ తెలుసుకుంటారు. ప్రజలిచ్చే విజ్ఞాపనలు పరిశీలించి.. సంబంధిత శాఖలకు తెలియచేసి పరిష్కారం కోసం కృషి చేస్తారు. వారాహి యాత్ర రాష్ట్ర ప్రజల్లో చైతన్యం, ధైర్యం నింపుతుందని జనసేన నేతలు చెబుతున్నారు.
యాత్ర ద్వారా జనం సమస్యలు తెలుసుకోవటంతోపాటు.. జనసేన విజయం సాధిస్తే ఏం చేస్తారో వివరించనున్నారు. జనసేన ఆవిర్భావ సభ వేదికగా ప్రకటించిన షణ్ముక వ్యూహాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. వైసీపీ సర్కారు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, సీఎం సహా వైసీపీ నేతల అవినీతి వ్యవహారాల్ని ప్రజల ముందు ఎండగడతారని జనసేన నేతలు చెబుతున్నారు.
భారీగా ఏర్పాట్లు: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తలపెట్టిన వారాహి యాత్రలో భాగంగా కత్తిపూడిలో నిర్వహించే బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్నవరం క్షేత్రంలో వారాహికి ప్రత్యేక పూజలు అనంతరం సాయంత్రం కత్తిపూడిలో జరిగే సభలో పవన్ పాల్గొంటారు. ఈ మేరకు పార్టీ శ్రేణులు అన్నవరం నుంచి కత్తిపూడి వరకు భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.
విశాఖపట్నం, రాజహమహేంద్రవరం, కాకినాడ నుంచి వచ్చే వాహనాలకు ఆయా మార్గాల్లోనే పార్కింగ్ స్థలాలను కేటాయించారు. పవన్ తలపెట్టిన వారాహి యాత్రలో ఇదే మొదటి సభ కావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు.
జనసైనికులు విజయవంతం చేయండి : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం నుంచి చేపట్టనున్న యాత్రకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన నేత కందుల దుర్గేష్ చెప్పారు. అన్నవరం క్షేత్రంలో పూజలు అనంతరం గోదావరి జిల్లాల్లో యాత్ర ప్రారంభమవుతుందని.. పలు ప్రాంతాలలో వారాహి యాత్ర కొనసాగుతుందని తెలిపారు. కత్తిపూడి, పిఠాపురం, తదితర ప్రాంతాలలో నిర్వహించనున్న సభలకు జనసైనికులు అధిక సంఖ్యలో తరలివచ్చియాత్ర విజయవంతం చేయాలని దుర్గేశ్ విజ్ఞప్తి చేశారు.
జనసేన నేతల ప్రత్యేక పూజలు: పవన్ కల్యాణ్ వారాహి యాత్ర విజయవంతం కావాలని.. గుంటూరు నగరంలోని నాజ్ సెంటర్లో ఆంజనేయ స్వామి ఆలయంలో జనసేన పార్టీ నేత నేరెళ్ళ సురేష్ ప్రత్యేక పూజలు జరిపారు. ప్రజా హితం కోసం పవన్ కల్యాణ్ ఆరంబిస్తున్న వారాహి యాత్రకు ఎటువంటి దుష్ట శక్తులు అడ్డు పడకుండా ఉండాలని హనుమంతుని వేడుకొన్నారు. వీరికి ఆలయ పండితులు పూజలు ప్రత్యేక పూజలు జరిపించారు. ఈ యాత్ర ద్వారా సైకో పాలనకు.. ప్రజలంతా చరమగీతం పాడాలని పార్టీ నేతలు కోరారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని.. వారాహి యాత్రను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం వారాహి యాత్ర పోస్టర్స్‌ని ఆటోలకు అతికించారు.