Pawan Kalyan Varahi Yatra: జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహియాత్రకు సర్వం సిద్ధమైంది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచే యాత్రకు శ్రీకారం చుట్టేందుకు సన్నద్ధమయ్యారు. అన్నవరం సత్య నారాయణ స్వామికి పూజలు నిర్వహించిన తర్వాత.. ఆయన వారాహి యాత్ర అధికారికంగా మొదలువుతుంది. ఇందుకోసం.. రాత్రే అన్నవరం చేరుకున్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో యాగం పూర్తైన తర్వాత.. వారాహికి పూజలు నిర్వహించి.. అక్కడి నుంచి కదిలారు. రాజమహేంద్రవరం విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో అన్నవరం వచ్చారు.
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో.. 10 రోజులపాటు యాత్ర సాగుతుంది. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ గ్రామీణం, కాకినాడ నగరం, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో యాత్ర ఉండేలా.. రూట్ మ్యాప్ ఖరారు చేశారు. మొత్తం 6 సభల్లో పవన్ ప్రసంగించనుండగా.. సాయంత్రం కత్తిపూడిలో మొదటి బహిరంగసభ ఏర్పాటు చేశారు. పవన్ వారాహి యాత్రకు ఎలాంటి అడ్డంకులు లేవని.. పోలీసులు స్పష్టంచేశారు. వారాహి యాత్ర మార్గాలు.. ఇప్పటికే పవన్ ఫ్లెక్సీలతో నిండిపోయాయి. జనసేనానికి ఘన స్వాగతం పలికేందుకు.. జనసైనికులు విస్తృత ఏర్పాట్లు చేశారు.
"వారాహి యాత్రలో భాగంగా.. స్థానికంగా ఉన్న సమస్యల గురించి ఆ నియోజకవర్గంలో ఉన్న వివిధ వర్గాలవారితో మాట్లాడి తెలుసుకుంటారు. జనవాణి కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ అర్జీలు స్వీకరించి.. స్థానికంగా సమస్య ప్రధానంగా ఉన్న ప్రాంతానికి క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసి.. దానిపై మొత్తంగా ఒక సమగ్ర ఆలోచనతో.. ఆ మరుసటి రోజు వారాహి వాహనంలో వాటిపై మాట్లాడటం జరుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎన్నికలకు ఏవిధంగా సమయత్వం అవుతుంది..ఎలా ఈ వైసీపీ దుష్ట ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంటుందనే ఆలోచనపై కూడా ఈ పర్యటనలో తెలుస్తుంది." - కందుల దుర్గేశ్, జనసేన నేత
"వారాహి యాత్రకు ఎలాంటి అడ్డంకులు లేవు. చట్టప్రకారం మేము అన్ని చర్యలు తీసుకుంటాము. అదే విధంగా ప్రజలకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూసుకుంటాము. ముఖ్యంగా ట్రాఫిక్ సమస్యపై దృష్టి పెట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటాము." - సతీష్ కుమార్, కాకినాడ జిల్లా ఎస్పీ
పవన్ కల్యాణ్ తలపెట్టిన వారాహి యాత్రకు సర్వం సిద్ధమైంది. బుధవారం నుంచి ఈ యాత్ర ప్రారంభవుతుండగా.. కత్తిపూడి కూడలిలో తొలి బహిరంగ సభ నిర్వహించనున్నారు. వారాహి యాత్రకు పెద్ద ఎత్తున జన సైనికులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో.. అందుకు తగిన ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ మేరకు వివిధ తేదీల్లో జరిగే బహిరంగ సభల వివరాలను వెల్లడించారు. మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
ఇవీ చదవండి: