ఉభయగోదావరి జిల్లాలకు ప్రధాన వాణిజ్య కేంద్రం రాజమహేంద్రవరానికి నిత్యం లక్ష మంది ఇతర ప్రాంతాల నుంచి వస్తుంటారు. దీంతో ట్రాఫిక్ సమస్య జటిలంగా మారుతోంది. ప్రధాన ప్రాంతాల్లో వాహనాలు నిలిపే ప్రత్యేక ప్రదేశాలు లేకపోవడంతో రోడ్లపైనే నిలిపేస్తున్నారు. రహదారుల విస్తరణ లేకపోవడం, పాత నగరాన్ని విస్తరించకపోవడంతోపాటు, ట్రాఫిక్ నిబంధనలు సమర్థంగా అమలు కాకపోవడంతో సమస్య ఎదురవుతోంది.
ప్రత్యామ్నాయం: బృహత్తర ప్రణాళికకు అనుగుణంగా రహదారులు విస్తరించాలి. 1975 తర్వాత కొత్త మాస్టర్‌ప్లాన్ 2017లో ఆమోదించినా అమలుకు నోచుకోవడం లేదు. మెయిన్‌రోడ్డు, తాడితోట, దేవీచౌక్, ఎస్వీజీ మార్కెట్ ప్రాంతాల్లో రోడ్ల విస్తరణకు రాజకీయ ఒత్తిళ్లతో అధికారులు చేతులెత్తేస్తున్నారు. ప్రధాన కూడళ్లను రద్దీకి అనుగుణంగా మెరుగుపరచాలి.
నగరంలోని రద్దీ ప్రాంతాల్లో సెల్లార్ల, ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపై దృష్టి సారిస్తున్నాం. మల్టీలెవెల్ పార్కింగ్ ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను గుర్తించి, ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాం. - అభిషిక్త్ కిషోర్, కమిషనర్, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ
పరిష్కారం : రాజమహేంద్రవరంలో 19 కూడళ్లు ఉండగా.. ఆర్ట్స్ కళాశాల, ఏవీఏ రోడ్డు, నందం గనిరాజు సెంటర్, కోటిపల్లి బస్టాండ్, షెల్టాన్ హోటల్ వద్ద జంక్షన్లను ఆధునికీకరించే పనులు చేపడుతున్నారు. నగరంలో 23 మార్గాలను విస్తరించి, డివైడర్లను ఏర్పాటు చేసేందుకు రూ. 20 కోట్లతో పనులు ప్రతిపాదించగా కోరుకొండ రోడ్డు, టీటీడీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. మెయిన్‌రోడ్డులో మల్టీలెవెల్ పార్కింగ్‌కు సన్నాహాలు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కావడంతో నలుమూలల నుంచి వచ్చేవారితోపాటు, పోర్టు, పరిశ్రమలు ఉండడంతో కాకినాడలో వాహనాల రద్దీ ఎక్కువే.. ఆకర్షణీయ నగరంలో భాగంగా రెండేళ్ల క్రితం ఏర్పాటు చేసిన జర్మన్ సాంకేతికతతో కూడిన సెన్సార్ ఆధారిత ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ విధానం నేటికీ అందుబాటులోకి రాలేదు. సైకిల్ ట్రాక్, నడక దారులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినా పార్కింగ్ స్థలాలు లేకపోవడంతో వీటిపైనే వాహనాలు నిలిపివేస్తున్నారు.
ప్రత్యామ్నాయం: నగరంలో నూతనంగా నిర్మిస్తున్న సైన్స్ సెంటర్, కళాక్షేత్రం రద్దీ దృష్ట్యా కుళాయిచెరువు పార్కు వద్ద రూ. 11.50 కోట్లతో బహుళ అంతస్థుల పార్కింగ్ ప్రదేశం (మల్టీలెవెల్ పార్కింగ్) ఏర్పాటు చేయాలని భావించారు. స్మార్ట్ సిటీలో భాగంగా ఈ ప్రణాళిక ఉన్నా.. తర్వాత ఈ నిధులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు మళ్లించడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. వీటిపై దృష్టి సారించాలి.
నగరంలో పార్కింగ్ ప్రాంతాల కోసం ఖాళీ స్థలాలు అన్వేషిస్తున్నాం. ఉప్పుటేరుపై వంతెన, పెద్ద మార్కెట్ అభివృద్ధి కోసం అందరి నిర్ణయంతో మల్టీలెవెల్ పార్కిగ్ కోసం కేటాయించిన నిధులు మళ్లిస్తున్నాం. - స్వప్నిల్ దినకర్ పుండ్కర్, కమిషనర్, కాకినాడ
పరిష్కారం : కాకినాడ నగరంలో కీలకమైన మెయిన్‌రోడ్డులో పార్కింగ్ సదుపాయం లేక రోడ్డుకు ఓవైపు దుకాణాల ఎదుట వాహనాలు నిలిపే అవకాశం ఇచ్చారు. దీంతో వ్యాపారాలు సాగడంలేదని అక్కడివారు గొల్లుమంటున్నారు. డీఈవో కార్యాలయం ఎదురుగా మున్సిపల్ స్థలాన్ని పార్కింగ్‌కు కేటాయిస్తే సమస్యకు తెరపడే అవకాశం ఉంది. భానుగుడి, బాలాజీ చెరువు కూడళ్లు నిత్యం రద్దీగా ఉంటాయి. నాగమల్లితోట, సర్పవరం కూడళ్ల మీదుగా ఆసుపత్రులు, ప్రధాన కార్యాలయాలకు వెళ్లాల్సి ఉంది. ఆయాచోట్ల ప్రత్యేక పార్కింగ్ ప్రాంతాలు కేటాయించాల్సి ఉంది.
ఇదీ చదవండి: రైతు బీమా ప్రీమియంపై రాత్రికి రాత్రే జీవోనా?: అచ్చెన్నాయుడు