తూర్పు గోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని తాళ్లరేవు , ఐ పోలవరం, కాట్రేనికోన ముమ్మిడివరం మండలాల పరిధిలో ప్రకృతి వైపరీత్యాలు వేల ఎకరాల్లో వరిసాగు చేసే అన్నదాతలకు నాలుగేళ్లుగా పలు రకాలుగా అన్యాయమే చేస్తున్నాయి.
వరి ప్రారంభంలోనే మొదలైన సమస్యలు..
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో కరోనా కారణంగా వ్యవసాయ కూలీల కొరతతో సాగు ప్రారంభం ఆలస్యమైంది. జూలై నెలలో ఆకుమడుల దశలో అకాల వర్షాల కారణంగా మడులు ముంపుకు గురై వరి నాట్లు తొందరగా వేయలేదు. సెప్టెంబర్ అక్టోబర్ నెలల్లో పచ్చగా ఉన్న పంట పొలాలను వరదలు ముంచెత్తాయి... దీంతో 40 శాతం పంటలకు నష్టం వాటిల్లింది.. వరదలకు తట్టుకుని నిలబడిన 60 శాతం పంట చేలను బతికించుకునేందుకు రైతులు మరలా పెట్టుబడి పెట్టక తప్పలేదు.
పంట చేతికొచ్చే వేళా...తుపాను బీభత్సం
అప్పటికే ఎకరాకు 20 వేలు ఖర్చు చేసిన రైతులకు ఇది అదనపు భారమైంది. వరి కోతకు సిద్ధమౌతున్న దశలో వీచిన ఈదురు గాలులకు చేలన్నీ నేలనంటాయి. వరికోత యంత్రాలతో నూర్పిడికి వీలుపడకపోవడంతో రైతులు కూలీల ద్వారా కోతల చేశారు. వ్యవసాయ కూలీల కొరత కారణంగా కోతలు మరింత ఆలస్యమయ్యాయి.. అక్టోబర్ నెలాఖరు నాటికి పూర్తి కావాల్సిన ధాన్యం కోతలు.. నవంబర్ నెలాఖరు వరకు కొనసాగుతూనే ఉన్నాయి.
నాలుగురోజులుగా పంటంతా నీటిలోనే
ఈనెలలో ఏర్పడిన తుపాను ప్రభావంతో కురిసిన వర్షాలకు పంటచేలు ముంపుబారిన పడ్డాయి. కోతకు సిద్ధంగా ఉన్న చేలు.. పనలున్న పొలాలు.. వరి కుప్పలు..గట్లపైన ధాన్యం రాశులు... గత నాలుగు రోజులుగా నీటిలో నానుతున్నాయి. ధాన్యం గింజలనుంచి మొలకలు వచ్చేస్తున్నాయి.. నీటిలోని పంటను గట్టుకు చేర్చాలంటే ఇప్పుడు ఎకరాకు 5 వేలు చొప్పున అదనపు ఖర్చు చేయవలసి వస్తోంది.
బస్తా గింజలు కూడా రావు..
అయినా బస్తా గింజలు కూడా దక్కుతాయనే నమ్మకం లేదంటున్నారు రైతులు.. అలా అని చేలో నీ వదిలేయలేమంటున్నారు.. ఈ పనులన్నీ పూర్తి కావడానికి ఈ నెలాఖరు వరకు సమయం పడుతుందన్నారు. తొలకరి పంటకు చేసిన అప్పును చెల్లిస్తేనే రెండో పంటకు అప్పు ఇస్తారని.. ప్రస్తుత పరిస్థితుల్లో అప్పు తీర్చలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా అప్పు తెచ్చుకోలేమని... ప్రభుత్వమే తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు.
ఎక్కువవుతున్న అప్పులు..
ఎకరాకు 25వేలు ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. తెదేపా, జనసేన నాయకులు పంట మునిగిన ప్రాంతాలలో పర్యటించారు. మండలాల వారీగా వ్యవసాయ అధికారులు పంట నష్టం అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి.
'నివర్'ను జాతీయ విపత్తుగా ప్రకటించి రైతులను ఆదుకోండి: సీపీఐ