గోదావరి వరద ఇంకా కొనసాగుతూనే ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని లంక భూములను వరద ముంచెత్తింది. ఈ కారణంగా లంకలో ఉన్న పశువులను ఏటిగట్టు మీదకు తరలించారు రైతులు. లంక భూములు వరద నీటిలో ఉండటంతో మేతకు తీవ్ర కొరత ఏర్పడింది. మేత లేక పశువులు విలవిలలాడుతున్నాయి.
మొత్తం జిల్లాలోని పశుసంపదలో 30 శాతం పైబడి గోదావరి లంక భూముల్లో లభించే పచ్చిమేతపై ఆధారపడి ఉన్నాయి. గత ఆరు రోజులుగా వరదల కారణంగా పశువులకు గ్రాసం లేక రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ లభించిన ఎండు గడ్డిని రైతులు తీసుకెళ్లి పశువులకు వేస్తున్నారు.
ప్రభుత్వ పరంగా జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని పశువులకు 188 టన్నుల సైలేజ్ గడ్డి రైతులకు అందించామని తూర్పు గోదావరి జిల్లా పశుసంవర్ధక సంయుక్త సంచాలకుడు డాక్టర్ ఎన్టీ శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం అందించే మేత ఏ మాత్రం సరిపోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇదీ చదవండి: పెట్టుబడిదారులకు అనువుగా నూతన పర్యటక పాలసీ: సీఎం జగన్