నేడు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేశారు. ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలని.. ఒప్పంద కార్మికులను క్రమబద్దీకరించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను వెంటనే పరిష్కరించకుంటే.. నిరవధిక సమ్మెకు వెనకాడబోమని హెచ్చరించారు.
ప్రకాశం జిల్లాలో...
తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా చీరాలలో మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులు ఒకరోజు సమ్మెలో పాల్గొన్నారు. ఒప్పంద కార్మిలను రెగ్యులర్ చేయాలని, ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
తూర్పుగోదావరి జిల్లాలో...
న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తూర్పు గోదావరి జిల్లా తుని పురపాలక కార్యాలయం వద్ద కార్మికులు ఆందోళన చేపట్టారు. ఒప్పంద కార్మికులను క్రమబద్ధీకరించాలని, కరోనా కాలంలో నియమించిన కార్మికుల తొలగింపును ఆపాలని డిమాండ్ చేశారు. పురపాలక అధికారులకు వినతి పత్రం అందజేశారు.
కృష్ణా జిల్లాలో..
మున్సిపల్ కార్మికులను, ఉద్యోగులను ఆప్కాస్ నుంచి మినహాయించాలని... కాంట్రాక్ట్ ఉద్యోగులను, కార్మికులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడలో మున్సిపల్ కార్మికులు ఒక రోజు సమ్మె చేపట్టారు. తమ సమస్యలు పరిష్కరించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు.
కర్నూలు జిల్లాలో...
తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలంటూ నంద్యాలలో మున్సిపల్ కార్మికులు ధర్నా చేశారు. పురపాలక సంఘం కార్యాలయం ఎదుట వంటావార్పు నిర్వహించారు.
విజయనగరం జిల్లాలో...
విజయనగరం కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు ధర్నా నిర్వహించారు. కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలని... పీఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ విరమణ లాభాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉప కలెక్టర్ కార్యాలయం వద్ద వంటా-వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. అమ్మ ఓడితో సహా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు.
ఇదీ చదవండి: