పేదరికం అతని ఆసక్తిని ఆపలేకపోయింది... పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వర్తిస్తూ... పవర్ లిఫ్టింగ్‌లో పతకాలు సాధిస్తున్నాడు.. ప్రమాదంలో గాయపడినా... పట్టువిడవకుండా సాధన చేశాడు... సంవత్సరంలోనే పుంజుకుని పతకాల పంటపండిస్తున్నాడు. లెక్కకు మించిన పతకాలు సాధించినా... ప్రోత్సాహం మాత్రం శూన్యం.
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ కాలనీలో ఉంటున్న బాలకృష్ణకు చిన్నప్పటి నుంచి వ్యాయామంపై ఆసక్తి ఉండేది. ఆ ఆసక్తే పవర్ లిఫ్టింగ్ వైపు వెళ్లెటట్లు చేసింది. పేద కుటుంబం... దీనికి తోడు చిన్న వయసులోనే పెళ్లి. కుటుంబ బాధ్యత అంతా తనపైనే ఉన్నా... పవర్ లిఫ్టింగ్ సాధన మాత్రం మానేయలేదు..
ఉదయం లేవగానే డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను వెలకితీసే పనుల్లో నిమగ్నమవుతాడు.. మధ్యాహ్నాం వరకు పారిశుద్ధ్య పనులు చేసిన అనంతరం పవర్ లిఫ్టింగ్ కసరత్తులు మెుదలపెడతాడు.
బాలకృష్ణ 2014 నుంచి ఇప్పటి వరకు 74, 83 కేజీల జూనియర్, సీనియర్ విభాగాల్లో 17 సార్లు పాల్గొని పతకాలు సాధించాడు. 2017లో జగ్గయ్యపేటలో జరిగిన పోటీల్లో రెండు విభాగాల్లోనూ స్ట్రాంగ్ మెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. 2020 జనవరిలో హైదరాబాద్ వేదికగా జరిగిన సౌత్ ఇండియా పవర్ లిఫ్టింగ్ సీనియర్ విభాగంలో రజిత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.
2018లో రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైనా... బాలకృష్ణ ఆత్మస్థైర్యాన్ని కోల్పోలేదు. తిరిగి కోలుకొని రెట్టించిన ఉత్సాహంతో పోటీల్లో పాల్గొని పతకాల పంట పండిస్తున్నాడు.
బాలకృష్ణది పేద కుటుంబం.. ఇతనికి వచ్చే ఆదాయంపైనే కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఒక పక్క పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తూనే... మరో పక్క పవర్ లిఫ్టింగ్ కోసం కఠోర సాధన చేస్తున్నాడు. బాలకృష్ణకు వచ్చే ఆదాయం కుటుంబ పోషణకే సరిపోవటం లేదు. స్నేహితులు.. జిమ్ ట్రైనర్ సాయంతో పోటీల్లో పాల్గొంటున్నాడు.
బాలకృష్ణ వేసుకునే పవర్ లిఫ్టింగ్ సూట్ సైతం సెకెండ్ హ్యాండ్స్‌లో కొని వాడుతున్నాడు. అది కూడా చిరిగిపోయింది. రెండోది కొనే స్థోమత లేకపోవటంతో దాన్ని వాడుతున్నాడు.
ఇన్ని పతకాలు సాధిస్తున్నా స్పాన్సర్లు, క్రీడా సంస్థలు, ప్రభుత్వం ప్రోత్సాహం లేదు. తన ప్రతిభను గుర్తించి కొంత ప్రోత్సాహం అందిస్తే చాలు... అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ పేరును నిలబెడతానని చెప్తున్నాడీ పేద పవర్ లిఫ్టర్.
ఇదీ చదవండి: నూతన చట్టంతో ఆక్వా రంగానికి భరోసా!