తెదేపాను వీడి భాజపాలో చేరిన నలుగురు రాజ్యసభ సభ్యులను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెల్ల ఏనుగులతో పోల్చారు. అలాంటివారిని ఇకపై పార్టీ సహించదని... చిత్తశుద్ధితో ప్రజల్లోకి చొచ్చుకెళ్లే యువతకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. కాకినాడలోని తెదేపా కార్యాలయంలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశం అనంతరం ఆయన మాట్లాడారు. జన్మభూమి కమిటీలపై ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్.. గతంలో తప్పుడు ప్రచారం చేశారని ఆరోపించారు.
వైకాపా కార్యకర్తలకు రాజకీయ పునరావాసం కల్పించడానికే గ్రామవాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తున్నారన్నారు. ప్రభుత్వం సొమ్ముతో నిర్మించిన ప్రజావేదికను కూల్చాల్సిన అవసరమేముందని ప్రశ్నించారు. సీనియర్ నేతలందరూ కలసి రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించామన్నారు. త్వరలోనే జిల్లా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సమన్వయ కమిటీ సమావేశంలో మాజీ మంత్రులు యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, జిల్లా తెదేపా అధ్యక్షుడు నామన రాంబాబు, ఉపాధ్యక్షుడు గొల్లపల్లి సూర్యారావు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, ఎమ్మెల్సీలు చిక్కాల రామచంద్రరావు, చైతన్య రాజు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.