Deputy CM Narayana Swami: తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగిలో బుధవారం జీలుగుకల్లు తాగి ఐదుగురు మృతిచెందిన ఘటనపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి స్పందించారు. ఆ కల్లులో రసాయనాలు కలిసినట్లు నివేదిక ద్వారా తెలుస్తోందన్నారు. వ్యక్తిగత వైరంతో కల్లులో విషం కలిపినట్లు ప్రాథమికంగా తేలిందన్నారు. విచారణ జరుగుతోందని.. త్వరలోనే అన్ని వివరాలు తెలుస్తాయని ఉపముఖ్యమంత్రి వివరించారు.
ఎం జరిగిందంటే...
తూర్పుగోదావరి జిల్లా మన్యంలో విషాదం చోటు చేసుకుంది. జీలుగు కల్లు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. రాజవొమ్మంగి మండలంలోని మారుమూల గిరిజన గ్రామం లోదొడ్డికి చెందిన పి.గంగరాజు (35), సీహెచ్.సుగ్రీవ్ (70), వి.లోవరాజు(28), బి.సన్యాసిరావు(65), కె.ఏసుబాబు(23) తరచూ జీలుగు కల్లు తాగుతారు. బుధవారం కూడా సొంత జీలుగు చెట్టు ఎక్కి కల్లు సేకరించి తాగారు. ఆ తర్వాత కాసేపటికే వాంతులు చేసుకుంటూ అస్వస్థతకు గురికావడంతో వారిని సర్పంచి లోతా రామారావు, స్థానికులు ద్విచక్ర వాహనాలపై జడ్డంగి పీహెచ్‌సీకి తరలించారు. ఇన్‌ఛార్జి వైద్యాధికారి శ్రీదుర్గ ప్రథమ చికిత్స చేశారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో కాకినాడకు తరలించారు.
ఆసుపత్రికి తీసుకెళ్తుండగా సుగ్రీవ్, లోవరాజు చనిపోయారు. గంగరాజు, సన్యాసిరావును కాకినాడ జీజీహెచ్‌లో వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయినట్లు నిర్ధారించారు. ఏసుబాబు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మరో వ్యక్తి కూడా కల్లు నోట్లో వేసుకున్నప్పుడు వాసన రావడంతో ఉమ్మేయడంతో అతను ప్రాణాలతో బతికాడు. గంగరాజు, సన్యాసిరావు పక్క పక్క ఇళ్లవారు కావడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి కారణాలు మాత్రం తెలియలేదు. పోలీసులు, అబ్కారీ, రెవెన్యూ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని నమూనాలు సేకరించారు.
ఇదీ చదవండి..
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం.. జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి