వైకాపా అధికారంలోకి వస్తే తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలంలో దివీస్ పరిశ్రమ ఏర్పాటును అడ్డుకుంటామని చెప్పిన జగన్.. ఇప్పుడు పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు నిమ్మకాయల చినరాజప్ప దుయ్యబట్టారు. మంత్రి కన్నబాబు దీనిపై అవాస్తవాలు మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. 2004లో వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేవీపీ రామచంద్రారావు కోన ప్రాంతంలో భూములు కొనుగోలు చేశారని... అప్పటి నుంచి 2014 వరకు రైతులు, మత్స్యకారులు ఆ భూముల్లో దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకించారని గుర్తు చేశారు.
పరిశ్రమ వెనక్కి వెళ్లిపోయేలా తెదేపా ప్రభుత్వం వ్యవహరిస్తే... వైకాపా అధికారంలోకి వచ్చాక భూముల్ని అరబిందో సంస్థకు అప్పగించేందుకు కుట్రలు పన్నిందని ఆరోపించారు. జగన్ బినామీలకు కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు కన్నబాబు మసి పూయాలని చూస్తున్నారని చినరాజప్ప ఆక్షేపించారు. వైకాపా కుట్రలు, స్వార్థాలను ప్రజలు గమనించాలని ఆయన కోరారు.
ఇదీ చదవండి