మల్లాడి కృష్ణారావు.. ప్రస్తుతం పుదుచ్చేరి ఆరోగ్యశాఖ మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. 1996లో మొదటిసారిగా శాసనసభకు ఎన్నికయ్యారు. అప్పటినుంచి ప్రజా సేవలో మమేకమై 25 ఏళ్లుగా సుదీర్ఘ రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. ఇండిపెండెంట్గా, అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కాలంలోనూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వంద శాతం అందించడంలో మల్లాడి తనవంతు కృషిచేశారు. అందుకుగానూ 2000, 2005లో ఆ రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉత్తమ శాసనసభ్యుడి పురస్కారం అందుకున్నారు. ఇక ఈ ఏడాది ప్రజలను అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి నుంచి నియోజకవర్గ ప్రజలను రక్షించడంలో ఎనలేని చొరవ చూపారు. ఆరోగ్య మంత్రిగా ఆయన తీసుకున్న చర్యలకు, ప్రజలకు అందించిన సేవలకుగానూ ముచ్చటగా మూడోసారి ఉత్తమ శాసనసభ్యునిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఇది యానాం ప్రజలకు వచ్చిన గౌరవం
మంత్రి మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ.. తనకు వచ్చిన ఈ పురస్కారం యానాం ప్రజలకు వచ్చిన గౌరవమని వ్యాఖ్యానించారు. ప్రజలకు సేవ చేయాలనే దృఢ సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. ప్రజల సహాయ సహకారాలతోనే నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపానని వెల్లడించారు. యానాం ప్రజలు 5 సార్లు తనను గెలిపించి ఎన్నుకోవడమే దీనికంతటికీ కారణమని అన్నారు.
అభిమానుల సంబరాలు
తమిళ ప్రాబల్యమున్న రాష్ట్రంలో ఒక తెలుగు శాసనసభ్యులు మూడోసారి ఉత్తమ ఎమ్మెల్యేగా ఎంపిక కావడం పట్ల ఆయన అభిమానులు సంబరాలు చేసుకున్నారు. మల్లాడి నివాసంలో వందలాది మంది కార్యకర్తలు ఆయనను అభినందించి శాలువాతో సత్కరించారు.
ఇవీ చదవండి..
ఆర్టీసీ బస్సులో భారీగా నగదు పట్టివేత.. రూ.1.9 కోట్లు స్వాధీనం